NTR : కుప్పంలో జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ డిమాండ్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

NTR : కుప్పంలో జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ డిమాండ్

Jr Nrt

NTR  :  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పం నియోజక వర్గంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభ్యులు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ 40 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ జెండాను ఎగరేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

సీనీ హీరోగా మాస్ ఇమేజ్, పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పోలికలు ఉండటం..మాస్ డైలాగులతో ఆకట్టుకునేతత్వం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలో క్రియాశీలకంగా చూడాలని పార్టీ నాయకులు ఎప్పటినుంచో కోరుకుంటూనే ఉన్నారు. గతంలోనూ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ పార్టీ తరుఫున ప్రచారం నిర్వహించారు. పార్టీకి అవసరమైన సమయంలో తన సేవలు అందిస్తానని పలుమార్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఇప్పడు ఆ సమయం ఆసన్నమైందని ఆయన అభిమానులు అంటున్నారు.

40 ఏళ్ల టీడీపీ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న సమయంలో.. పార్టీలో నాయకత్వ మార్పు జరగబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గ్రౌండ్‌ రియాల్టీ ప్రకారం పార్టీలో యువ నాయకత్వం రాబోతోందన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఎవరికి వారే పార్టీలోకి వచ్చి టీడీపీని బలోపేతం చేయాలని తన మనసులోని మాటను బయటపెట్టారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

మున్సిపల్‌ ఎన్నికల్లో   పార్టీ  ఘోర పరాజయం తర్వాత.. టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. కొందరు పార్టీ సీనియర్లు కూడా జూనియర్ జపం చేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ పరాజయంతో చాలామంది చోటా మోటా నాయకులు పార్టీని వీడి బీజేపీ, వైసీపీ లో చేరుతున్నారు.  ఇప్పడు ఏపీలో టీడీపీని ఆదుకునే ప్రజాకర్షణ ఉన్ననాయకుడి కోసం క్యాడర్ ఎదురు చూస్తోంది.

కరోనా వైరస్ కారణంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్ ల ద్వారా కార్యకర్తలలో   ఉత్సాహాన్ని నింపుతున్నప్పటికీ   కింది స్ధాయి కార్యకర్తల పరిస్ధితి  కాస్త అగమ్య గోచరంగా ఉంది. వారు పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు కూడా కొందరు నాయకులు స్తబ్దుగా ఉండటానికి కారణం అవుతోంది.

సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే వినిపించే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఈ మధ్య తరుచూ వినిపిస్తోంది. ఒక వైపు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు చంద్రబాబునాయుడుని   టార్గెట్ చేస్తూ చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఏపీలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నాయకులను అడుగుడుగునా అడ్డుకుంటూనే ఉంది.

అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్లనరేంద్ర కుమార్ దాకా అనేకమంది టీడీపీ నాయకులపై వచ్చిన వివిధ ఆరోపణలపై కేసులు నమోదు చేసి వారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపధ్యంలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే, కార్య కర్తల్లో ధైర్యం నింపాలంటే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల అభిమానులు కోరటం ఎక్కవయ్యింది.

ఎన్టీఆర్ ఎక్కడైనా కార్యక్రమానికి హాజరైతే అక్కడ అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేయటం కూడా జరుగుతోంది. మొన్నా మధ్య కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి  అభిమానుల  నిరసన సెగ తగిలింది. పార్టీలోకి ఎన్టీఆర్ ను ఎప్పుడు తీసుకువస్తున్నారంటూ కార్యకర్తలు అడిగారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు.

చంద్రబాబును సార్..సార్ అంటూ పిలిచి మరీ…. జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలంటూ అక్కడి కార్యకర్తలు కోరారు. చంద్రబాబు వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. గతంలో ఒంగోలులోనూ సీఎం ఎన్టీఆర్ అంటూ అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు వేయించారు. అప్పటికీ పార్టీ అధినేత మాట దాట వేశారు. తాజాగా ఇప్పుడు కుప్పం నియోజక వర్గం ములుకలపల్లి గ్రామంలోని ఎన్టీ ఆర్ అభిమానులు మరోసారి తమ డిమాండ్ ను 40 అడుగుల భారీ జెండా రూపంలో ఆవిష్కరించారు.