ఎన్నికల అవకతవలపై సుప్రీం కెళ్తా: కేఏ పాల్

  • Published By: chvmurthy ,Published On : April 17, 2019 / 08:07 AM IST
ఎన్నికల అవకతవలపై సుప్రీం కెళ్తా: కేఏ పాల్

ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు.  నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా పని చేయని  45 పోలింగ్ బూత్ ల వివరాలు, ఆధారాలతో సహా  రిటర్నింగ్ అధికారి వేణుగోపాలరెడ్డి గారికి ఇచ్చినా  ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. స్ధానిక రిటర్నింగ్ అధికారి చర్య తీసుకోక పోవటంతో ఈసీ ద్వివేదికి ఫిర్యాదు చేశానని  పాల్ వివరించారు. ఏపీలో జరిగిన అవకతకలపై తాను అడిగిన ప్రశ్నలకు సీఈసీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని పాల్ చెప్పుకొచ్చారు.

1.పోలింగ్ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?నూటికి 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచెయ్యలేదు ?
2.తెల్లవారుఝూమున 3 గంటల వరకు ఎందుకు పోలింగ్ జరిగింది ?
3.పోలింగ్ ముగిసిన 2,3 గంటల్లో సీల్ చేయాల్సిన ఈవీఎంలు 18 గంటల సమయం గడిచేంతవరకు ఎందుకు లాక్  చేయలేదు ?
4.ఈవీఎంలలో 12వ బటన్ నొక్కితే 2వ బటన్ లో ఉన్న అభ్యర్ధికి ఓటు పడిందని చెప్పిన వారి దగ్గర ఎందుకు లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకోలేదు ?
5.పోలింగ్ అబ్జర్వర్లుగా దక్షణాది వారిని కాకుండా ఉత్తరాది వారినిఎందుకు నియమించారు ?
6.వీవీ ప్యాట్ స్లిప్పు 3 సెకండ్లే ఎందుకు కనపడుతోంది ?

వీటన్నిటికీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కానీ లిఖిత పూర్వక సమాధానం కావాలని ఆయన  కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పలు జాతీయ పార్టీలనాయకులను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఈ అన్ని అంశాలపైనా  గురు, శుక్ర వారాల్లో సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నానని పాల్ హెచ్చరించారు. 3వ విడత నుంచి జరిగే ఎన్నికలను బహిష్కరించేందుకు ఎన్డీయేతర రాజకీయ పార్టీలు అంగీకరించాయని పాల్ అన్నారు.