కారులో కోటి రూపాయలు, కడప జిల్లాలో నోట్ల కట్టల కలకలం

  • Published By: naveen ,Published On : November 25, 2020 / 05:28 PM IST
కారులో కోటి రూపాయలు, కడప జిల్లాలో నోట్ల కట్టల కలకలం

kadapa police sieze one crore rupees: కడప జిల్లాలో పోలీసులు భారీగా నగదుని స్వాధీనం చేసుకున్నారు. పీపీ కుంట చెక్ పోస్ట్ సమీపంలో జరిపిన తనిఖీల్లో కోటికి పైగా నగదు పట్టుబడింది. కర్నాటక నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారులో ఈ నగదు దొరికింది. నగదు ఎవరిది? ఎవరికి చేరుతుంది? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బుని ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసులు. నగదు ఓ వ్యాపారికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కారులో రూ.1.05కోట్ల నగదు:
కారులో కోటి రూపాయల వ్యవహారం దుమారం రేపింది. గోపవరం మండలం పీపీ కుంట చెక్‌పోస్టు దగ్గర బుధవారం(నవంబర్ 25,2020) ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి నెల్లూరు వస్తున్న వాహనంలో ఉన్న రూ.1.05 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో ఆరా తీశారు.

వక్కల వ్యాపారికి చెందిన నగదుగా గుర్తింపు:
కర్ణాటక దావణగిరె ప్రాంతానికి చెందిన కారులో తరలిస్తున్న రూ.1.05 కోట్లు నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు శివమొగ్గకు చెందిన వక్కల వ్యాపారి నాగేంద్రకు చెందినదిగా గుర్తించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రావాల్సిన బకాయిలను వసూళ్లు చేసుకుని నెల్లూరులో గ్రానైట్ కోసం అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్తునట్లు పోలీసుల విచారణలో తేలింది. నగదుని తిరుపతి ఆదాయపు పన్ను అధికారులకు అప్పగించారు పోలీసులు.