తిరుగులేని పదవి కానీ ఏం లాభం.. కాకినాడ ప్రథమపౌరులికి చుక్కలు చూపిస్తున్న అధికారులు, హక్కుల కోసం న్యాయపోరాటం

  • Published By: naveen ,Published On : November 5, 2020 / 03:09 PM IST
తిరుగులేని పదవి కానీ ఏం లాభం.. కాకినాడ ప్రథమపౌరులికి చుక్కలు చూపిస్తున్న అధికారులు, హక్కుల కోసం న్యాయపోరాటం

mayor Sunkara Pavani: ఏపీలోని కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నగర ప్రథమ పౌరురాలిగా తన ప్రాథమిక హక్కులను అధికార పార్టీ నేతలు హరిస్తున్నారని మేయర్‌ సుంకర పావని ఆవేదన చెందుతున్నారు. మేయర్‌ హోదాలో తనకు కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదని వాపోతున్నారట. చివరకు తన ప్రాథమిక హక్కులను సాధించుకొనేందుకు కోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నారు. రెండేళ్ల పాటు తిరుగులేకుండా సాగించిన పాలనకు, హవాకు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బ్రేకులు పడ్డాయని అంటున్నారు. టీడీపీ మేయర్‌గా పావని ఉన్నప్పటికీ రాష్ట్రంలో తమ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఒక్కో కార్పొరేటర్‌ మెల్లమెల్లగా అధికార పార్టీలోనికి జారుకుంటున్నారని అంటున్నారు.

పదవికి డోకా లేకపోయినా పరిపాలనలో డమ్మీ అయ్యారు:
ఒకప్పుడు 80 శాతం సీట్లతో బలంగా కనిపించిన మేయర్ ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెచ్చిన జీవో ప్రకారం మేయర్ పదవికి ఎలాంటి ఢోకా లేకపోయినా పరిపాలనలో ఆమె పూర్తిగా డమ్మీగా మారిపోయారని టాక్‌. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్న కార్పొరేషన్‌లో మేయర్‌కు కనీస ప్రాధాన్యం లేకుండా అధికార పార్టీ నాయకులు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు, కౌన్సిల్ సమావేశాల్లో మేయర్‌కు కనీస గౌరవం ఇవ్వకపోవడంతోపాటు ప్రొటోకాల్ పాటించకపోవడంపై పావనితో పాటు ఆమె అనుచరులు నిరుత్సాహానికి గురవుతున్నారట.

ఇంతవరకు యాంటీ రూమ్ లేదు:
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్స్ అఫిషియో సభ్యునిగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు కౌన్సిల్ హాల్‌కు అనుసంధానంగా ఉన్న మేయర్ చాంబర్‌ను అక్కడి నుంచి దూరంగా మార్చివేశారట. దీనిపై ఆమె మారు మాట్లాడకుండా ఉండేందుకు ఆ చాంబర్‌ను మహిళా కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్‌గా మార్చారట. మేయర్ చాంబర్‌కు అనుసంధానంగా ఉండాల్సిన యాంటీ రూమ్‌ను ఇప్పటివరకు నిర్మించలేదని చెబుతున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులకు కార్పోరేషన్ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్‌ను నిర్మించిన అధికారులు తనకు మాత్రం యాంటీ రూమ్‌ను నిర్మించకపోవడం పట్ల మేయర్ పావని గుర్రుగా ఉన్నారట.

ప్రాథమిక హక్కుల కోసం న్యాయ పోరాటం:
మరో విషయం ఏంటంటే.. అధికారులు ఈ పనులన్నీ చేసేటప్పుడు మేయర్‌గా తనకు కనీస సమాచారం సమాచారం ఇవ్వకపోవడంపై పావని అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఈ నేపథ్యంలోనే చాంబర్, మౌలిక వసతులు మేయర్ ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమని అందులో భాగంగా యాంటీ రూమ్ నిర్మించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. తన ప్రాథమిక హక్కును కాపాడుకోవడానికి మేయర్ పావని తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్ధానాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. నగర ప్రథమ పౌరురాలిగా ఉన్న ఆమె తమ ప్రాథమిక హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి?
నగరంలో అందరి హక్కులు కాపాడాల్సిన పావని తన హక్కుల కోసం న్యాయస్థానికి వెళ్తే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. మేయర్ చాంబర్‌కు అనుబంధంగా యాంటీ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులకు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఇంకా మీన మేషాలు లెక్కబెడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. తన హక్కులను కాలరాయడంతో పాటు కోర్టు ఆదేశాలను కమిషనర్‌ బేఖాతరు చేయడంపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.

మేయర్ తాను అనుకున్నది సాధిస్తారా? లేక సర్దుకుపోతారా?
అధికారులకు మరికొంత సమయం ఇచ్చి చూసే ధోరణిలో మేయర్ పావని ఉన్నారట. అప్పటికీ అధికారులు స్పందించకపోతే కోర్టు ధిక్కరణ లేదా హైకోర్టును ఆశ్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం మేయర్ ఇదంతా కావాలని చేస్తున్న రాద్ధాంతమే అని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ ప్రాథమిక హక్కులపై అధికారులు ఎలా స్పందిస్తారు? మేయర్ తాను అనుకున్నది సాధిస్తారా? లేక పరిపాలన లాగే ప్రాథమిక హక్కుల విషయంలో కూడా సర్దుకుపోతారా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు.