కాకినాడలో ఘర్షణలు : పవన్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పోలీసులు

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 04:02 AM IST
కాకినాడలో ఘర్షణలు : పవన్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పోలీసులు

కాకినాడలో జనసేన పార్టీ కార్యకర్తలపై వైసీపీ లీడర్స్ జరిపిన దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్..పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన జనసేన నాయకులపై వైసీపీ నాయకులు కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేశారు.

అయితే..జనసేన నేతలపై కేసులు పెట్టడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. 307 వంటి హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెడితే..ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి తేల్చుకుంటానని పవన్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. 307 మినహా మిగిలిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జనసేనానీ స్పందన కోసం నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. 

ఘర్షణ జరిగిన అనంతరం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత పూచికత్తుపై 2020, జనవరి 13వ తేదీ సోమవారం కొంతమందిని విడుదల చేశారు. విడుదలైన వారిలో పలువురు జనసేన వీర మహిళలున్నారు. మొత్తం ఘర్షణల్లో 5 FIRలు నమోదు చేశారు పోలీసులు. 

* జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ నిప్పురాజేసాయి. 
* పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ చేసిన కామెంట్స్‌పై జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. 
* ద్వారంపూడి వ్యాఖ్యలను నిరసిస్తూ.. జనసేన కార్యకర్తలు 2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఆయన ఇంటి  ముట్టడికి యత్నించారు. 
* వైసీపీ కార్యకర్తలు.. వారిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. 
 

* వైసీపీ, జనసేన కార్యకర్తలు రాళ్లు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
* ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 
* పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 
* అయితే ఈ గొడవ సందర్బంగా వైసీపీ నేతలను వదిలేసి జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : వరదొస్తే ముప్పే : అమరావతిపై హెచ్చరించిన చెన్నై ఐఐటీ