కాకినాడలో వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య, సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

కాకినాడలో వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య, సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

kakinada ycp corporator murder shocking cctv visuals: కాకినాడలో వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత కక్షల నేపథ్యంలో 9వ డివిజన్ కార్పొరేటర్ కంపర రమేశ్ ని.. చిన్నా అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. రాత్రి 2.30 గంటల సమయంలో హత్య జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సూర్య కార్ వాష్ సమీపంలో మర్డర్ జరిగినట్టు సీసీఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే రమేష్ హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ను పోలీసులు సేకరించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. మూడు సార్లు కారుతో తొక్కించి మరీ రమేష్ ని అతి దారుణంగా హత్య చేశాడు చిన్నా.

ముందుగా కారుతో గుద్దడంతో రమేష్ కింద పడిపోయాడు. అలాగే రమేష్ పైనుంచి కారుని పోనించాడు. ఆ తర్వాత రివర్స్ తీసుకుని రోడ్డు పై పడిపోయి ఉన్న రమేష్ పై నుంచి కారుని పోనించాడు. మళ్లీ వేగంగా ముందుకి వచ్చి మూడోసారి రోడ్డుపై నిర్జీవంగా పడున్న రమేష్ పైనుంచి కారుని పోనిచ్చాడు చిన్నా. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా చిన్నా ఆగలేదు. మూడుసార్లు రమేష్ పైకి కారు ఎక్కించాడు.

రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే చిన్నా అక్కడి నుంచి కారులో పారిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తుంటే.. ప్రతీకారంతో చిన్నా రగిలిపోయినట్టు కనిపిస్తోంది. ఎంత కక్ష ఉంటే, అంత దారుణంగా చంపుతాడని స్థానికులు అంటున్నారు. కాగా, ప్రశాంతమైన కాకినాడలో ఈ దారుణ హత్య సంచలనంగా మారింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

అసలేం జరిగిందంటే..
కార్పొరేటర్ కంపర రమేష్ నిన్న(ఫిబ్రవరి 11,2021) రాత్రి వాకపూడి గానుగచెట్టు సెంటర్ లోని సూర్య కార్ వాష్ షెడ్ దగ్గర స్నేహితులు ముత్యాల రమేష్, సుందరవాడ వాసు తో కలిసి మద్యం సేవించటానికి వచ్చారు. ముగ్గురూ కలిసి మద్యం సేవిస్తుండగా, మధ్యలో గురజాల చిన్నా అనే వ్యక్తి తన తమ్ముడితో కలిసి మద్యం సేవించటానికి వచ్చాడు. అందరూ మద్యం సేవించి ఇళ్లకు వెళ్లే సమయంలో.. తన కారు తాళాలు కనిపించక పోవటంతో ఎవరూ ఇక్కడ్నించి వెళ్లొద్దని రమేష్ కోరాడు. కానీ చిన్నా పట్టించుకోలేదు. తన కారు తీసుకుని ముందుకు వెళుతుండగా.. రమేష్.. చిన్నా కారుకు అడ్డం నిలుచున్నాడు. చిన్నా తన కారును వెనక్కి తీసుకొచ్చి తర్వాత వేగంగా రమేష్ మీదకు పోనిచ్చి ఢీకొట్టాడు. దీంతో రమేష్ కింద పడిపోయాడు.

అయినా, చిన్నా ఊరుకోలేదు. మళ్లీ రోడ్డుపై పడి ఉన్న రమేష్ మీదకు ఎక్కిస్తూ వెనక్కి వెళ్లాడు. అలా వచ్చిన చిన్నా మరోసారి కారుని వేగంగా రమేష్ మీద నుంచి ముందుకు పోనివ్వటంతో రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత చిన్నా కారులో పరారయ్యారు.