హస్తినకు కన్నా : అధ్యక్ష పదవి రెన్యువల్‌ కోసమేనా? 

  • Published By: sreehari ,Published On : January 21, 2020 / 12:14 PM IST
హస్తినకు కన్నా : అధ్యక్ష పదవి రెన్యువల్‌ కోసమేనా? 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరనే చర్చ ఇప్పుడు పార్టీలో జోరందుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరుగుతున్న తరుణంలో ఆయన ఒంటరిగా ఢిల్లీ వెళ్లడం రాష్ట్ర పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువ నాయకుడిని నియమించబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కాకపోతే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకే కన్నా హస్తిన వెళ్లారని బీజేపీలోని కొన్ని వర్గాలు అంటున్నాయి. 

కన్నాకు పోటీగా ముగ్గురు :
వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ తిరిగి అధ్యక్ష పదవిని కోరుకుంటుంటే, ఆయనకు పోటీగా పురంధేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీకి అనుకున్నంతగా అనుకూలంగా లేవు. అయినా కన్నా అధ్వర్యంలో ఒక ఎన్నికను నిర్వహించుకోగలిగారు. కాంగ్రెస్‌లో పని చేసిన అనుభవం, మంత్రిగా పని చేసిన సంబంధాలతో కన్నా బీజేపీ పగ్గాలను సామరస్యంగానే నెట్టుకొచ్చారనే అభిప్రాయం ఉంది. అప్పట్లో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన కన్నాను రాత్రికి రాత్రే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలిచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచీ కన్నా సీరియస్‌గానే పని చేస్తున్నారు. 

రాజ్యసభకు వెళ్తారా? :
ప్రస్తుతం రాష్ట్ర బాధ్యతలు వేరే నేతలకు అప్పగిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ పదవి కోసం పలువురు పోటీపడుతోన్న నేపథ్యంలో కన్నాను రాజ్యసభకు పంపించి, అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిని మారుస్తారనే అంశంపై బీజేపీ సీరియస్‌గానే తీసుకొంది. ఏపీ కమిటీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తోంది. కోర్ కమిటీలో తీర్మానం కూడా చేసింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై కన్నా లక్ష్మీనారాయణ ఆరంభం నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు. బీజేపీలో కొంతమంది మాత్రం సమర్థించినా, కోర్ కమిటీలో సైతం కన్నా ఒకే రాజధాని, అది అమరావతి అనే దానిపైనే అందరినీ ఆమోదింపజేసి, తీర్మానం కూడా చేయించారు. దీంతో అమరావతే ఏపీకి రాజధాని అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, రైతులు చేస్తోన్న ఆందోళనకు బాసటగా నిలవడం బీజేపీ బాధ్యతగా తీసుకున్నారు.

అధ్యక్ష రేసులో మళ్లీ ఆయనే :
గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కన్నా ఢీ అంటే ఢీ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా కన్నా ఎదురొడ్డి పోరాడారు. యువజన కాంగ్రెస్ నాయకునిగా సమర్థంగా పనిచేసిన కన్నా ఆ తర్వాత మంత్రి అయ్యారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుల్లో ఒకరిగా మెలిగారు. వైసీపీలోకి వెళ్లాల్సిన కన్నా ఆఖరి నిమిషంలో బీజేపీలోకి వెళ్లారు. ఇక్కడ కూడా తన సమర్థతను నిరూపించుకున్నారు. మళ్లీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆయనతో పాటు పురంధేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. మరి హైకమాండ్‌ మరోసారి కన్నాకు అవకాశం కల్పిస్తుందా? వేరే వారికి చాన్స్‌ ఇస్తుందా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే అంటున్నారు పార్టీ కార్యకర్తలు.