Kathi Mahesh Death Case : కత్తి మహేష్ మృతిపై విచారణ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Kathi Mahesh Death Case : కత్తి మహేష్ మృతిపై విచారణ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Kathi Mahesh Death Case Ready For Enquiry Ap Minister Adimulapu Suresh

Kathi Mahesh Death Case : ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు విచారణ చేపట్టి, నాడు కారు నడుపుతున్న సురేశ్ ను విచారించారు.

ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కత్తి మహేష్ మరణంపై విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కత్తి మహేష్ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. తమ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం రూ.17 లక్షలు మంజూరు చేసిందని ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు.

కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం చిత్తూరు జిల్లాలోని మహేశ్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని, రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్‌ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్‌కు తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.

కత్తి మహేశ్‌కు చాలామంది శత్రువులున్నారని.. గతంలోనూ ఆయనపై అనేక దాడులు జరిగాయని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే డ్రైవర్ సురేష్‌కు ఎందుకు చిన్నగాయం కూడా కాలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపైనా పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మహేశ్ కారు డ్రైవర్ సురేష్‌ను పోలీసులు విచారించారు.

కత్తి మహేష్‌ మృతిపై తమకూ అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు అన్నారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని అన్నారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కత్తి మహేష్ జూన్ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం సమీపంలో హైవే మీద ఈ ప్రమాదం జరిగింది. రెండు వారాలుగా చికిత్స పొందారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో మృతి చెందారు.

మహేశ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. తలకు, కంటికి తీవ్రగాయాలైన మహేశ్‌ను వెంటనే నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు వారాలుగా ఆయనకు అక్కడే చికిత్స జరిగింది. తొలుత డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. కానీ, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహేశ్‌ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుకోవడంతో చనిపోయారని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.