రూ.40కే కిలో ఉల్లిపాయలు, కొనేందుకు ఎగబడ్డ జనాలు, కిలోమీటర్ల మేర బారులు

  • Published By: naveen ,Published On : October 23, 2020 / 04:24 PM IST
రూ.40కే కిలో ఉల్లిపాయలు, కొనేందుకు ఎగబడ్డ జనాలు, కిలోమీటర్ల మేర బారులు

onion: ఉల్లి ధర సెంచరీ దాటడంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏపీ సర్కార్‌ సబ్సిడీపై ఉల్లిని విక్రయిస్తోంది. కిలో ఉల్లి పాయలను 40 రూపాయలకు విక్రయిస్తోంది. విజయనగరంలోని ఆర్‌ అండ్‌ బీ రైతు బజార్లలో సబ్సీడీ ఉల్లి విక్రయాలను జాయింట్ కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌ ప్రారంభించారు. తక్కువ ధరకు ఉల్లి దొరకడంతో ఉల్లి కోసం జనం ఎగబడుతున్నారు. రైతు బజార్ లో కిలోమీటర్ల మేర బారులు తీరారు.

కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు:

కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 90 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దాటి నాన్‌స్టాప్‌గా ఉల్లి ధర పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉల్లి కొనాలంటేనే కన్నీ ళ్లు పెట్టే పరిస్థితులొచ్చాయి. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో సరుకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. చుక్కలతో జతకడుతున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిని కొనలేకపోతున్నారు. వంటింటి నిత్యావసర సరుకైన ఉల్లి ధర అమాంతం పెరిగిపోవడతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉల్లిని కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ధరాఘాతంతో పేద, మధ్యతరగతి వాళ్లు అవస్థలు పడుతున్నారు.

ఓవైపు వానలు, మరోవైపు బ్లాక్ మార్కెట్:
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉల్లి ధరల ఘాటు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కిలో కొనాలనుకున్నవారు పావుకిలో, అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. సెప్టెంబర్‌ చివరి దాక 10, 15 రూపాయలు పలికిన ఉల్లి ధర.. అక్టోబర్‌ మొదట్లో 20కి పెరిగింది. ఈ నెలలో ఏకంగా మూడుసార్లు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర 90 రూపాయలు పలుకుతోంది. ఈ మధ్య కురుస్తున్న వానలతో మహారాష్ట్రలో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో కూడా వర్షాలకు రైతులు ఉల్లి పంటను కోల్పోయారు. వ్యాపారులు ఉల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితులలో ప్రజలు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిపాయలు పంపిణీ చేస్తే.. తప్ప సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపించడం లేదు.

పంట రావటానికి ఇంకా రెండు నెలల సమయం:
బహిరంగ మార్కెట్‌లో వారం రోజుల క్రితం కిలో ఉల్లిపాయల ధర 40 రూపాయలు ఉండేది. వారం రోజుల్లోనే ఆమాంతం 85 నుంచి 90కి చేరింది. నిజానికి ప్రకాశం జిల్లాకు మహారాష్ట్రలోని నాసిక్‌, బెంగళూరు, కర్నూలు జిల్లా నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. జిల్లాలోని మార్టూరు మండలంలోని పలు గ్రామాలలో ఉల్లి సాగు జరుగుతోంది. జిల్లాలోని పంట రావటానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 100 టన్నుల ఉల్లిపాయలు అవసరం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలలో ఎక్కువగా ఉల్లిపాయలను ఉపయోగిస్తుంటారు. గత నెలలో కురిసిన వర్షాలకు మహారాష్ట్రలో ఉల్లి పంట మొత్తం నాశనమైంది.