ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోతా, మంత్రి కొడాలి నాని

ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోతా, మంత్రి కొడాలి నాని

kodali nani challenge nara lokesh: ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత లోకేష్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేసి నారా లోకేష్ గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి.. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇంటింటికి రేషన్ సరఫరా కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఎన్నికల పేరుతో నిలిపివేశారన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఓ దిక్కు మాలిన పార్టీ… నిమ్మగడ్డకు ఈ కార్యక్రమంపై ఫిర్యాదు చేసిందని అన్నారు. ఆగిన బండి అని ఓ పత్రిక కథనాలు రాసిందని చెప్పారు. అంత చెత్త కార్యక్రమం అయితే ఎన్నికల కోడ్ పేరుతో ఆపటం ఎందుకు? అని మంత్రి ప్రశ్నించారు. తామేమీ కొన్ని మీడియా సంస్థల మీద ఆధారపడి పాలన చేయటం లేదని, ప్రజల్ని నమ్ముకుని పాలన చేస్తున్నామని, జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.

వైసీపీ పతనం ప్రారంభం అయ్యిందని అనటానికి చంద్రబాబుకు సిగ్గు లేదన్న ఆయన.. చంద్రబాబు మోసగాడని అన్నారు. ఎన్నికలు అయ్యే లోపు చంద్రబాబును, లోకేష్ ను ప్రజలు రాష్ట్రం నుండి వెళ్ళగొడతారని మంత్రి అన్నారు. కుట్రలు పన్నే అందరూ జగన్నాథ రధ చక్రాల కింద పడి నలిగిపోతారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేస్తానని మంత్రి కొడాలి నాని ప్రకటించారు.