కోడెల ఫ్యామిలీకి చంద్రబాబు రాంరాం.. ఇంఛార్జ్ పదవి కోసం శివరాం పాట్లు!

  • Published By: sreehari ,Published On : February 29, 2020 / 03:59 PM IST
కోడెల ఫ్యామిలీకి చంద్రబాబు రాంరాం.. ఇంఛార్జ్ పదవి కోసం శివరాం పాట్లు!

గుంటూరు జిల్లా టీడీపీ నేతలంతా ఆప్యాయంగా పల్నాటి పులి అని పిలుచుకునే కోడెల శివప్రసాద్ ఫ్యామిలీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒక డాక్టర్‌గా ఉంటూ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి, మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనది. వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచిన చరిత్ర కోడెలది. తర్వాత ఒకసారి సత్తెనపల్లి నుంచి గెలిచారు. ఆయన సిఫారసుతో అనేకమంది కొత్త నేతలకు అసెంబ్లీ టికెట్లు వచ్చాయి. ఎన్టీఆర్ హయాంలో  గుంటూరు జిల్లాలో ఏదైనా కోడెల  చేతి మీద నుంచి జరగాల్సిందే. ప్రస్తుతం టీడీపీలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి పుల్లారావు, యరపతినేని, జీవీ ఆంజనేయులు, చలమారెడ్డి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే చలపతి ఆంజనేయులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీమంత్రి శనక్కాయల అరుణ, ఇలా అనేక మంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లు  ఇప్పించిన ఘనత కోడెలదే. 

శివరాం పెత్తనంపై బాబుకు ఫిర్యాదు :
కోడెల శివప్రసాద్‌ పేరు చెప్తేనే యువతలో ఉత్తేజం కనబడుతుంది. కానీ, గత ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రతిష్ట మసకబారి అనేక అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కుటుంబ సభ్యులు కూడా కొంత కారణం అని టీడీపీ కేడర్ ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఆయన చనిపోయే వరకు కూడా సత్తెనపల్లి , నరసరావుపేట రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను చూశారు. కోడెల స్పీకర్‌గా ఉన్న ఐదేళ్లలో ఆయన వారసుడు శివరాం రెండు నియోజకవర్గాల్లో పెత్తనం చేశారు. శివరాం ఆధిపత్యం సహించని సీనియర్ నేతలంతా అనేకసార్లు చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. 

ఇంఛార్జ్ పోస్టు అప్పగించాలని విజ్ఞప్తి :
ఈలోపే సార్వత్రిక ఎన్నికలు రావడం, కోడెల ఓడిపోవడం జరిగిపోయాయి. అనంతర పరిణామాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సాధారణంగా అయితే సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కోడెల శివరాంని నియమించాలి. ఇప్పటికీ కోడెల మరణించి ఆరు నెలలు దాటినా ఆయన కుమారుడుకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదు టీడీపీ అధిష్ఠానం. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలని పలుసార్లు చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేశారు కోడెల శివరాం. మొన్ననే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పాత విషయాలు పట్టించుకోవద్దు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని అధినేతకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మాత్రం కోడెల కుటుంబ సభ్యులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. 

రెండు నియోజకవర్గాల్లో ఉన్న శివరాం బాధితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవద్దని అధినేతపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఒక ఫోన్ కాల్‌తో అసెంబ్లీ టికెట్ ఇప్పించారు కోడెల. నేడు ఆయన కుటుంబ సభ్యులు సత్తెనపల్లి ఇన్‌చార్జ్ కోసం అష్టకష్టాలు పడాల్సివస్తుందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు కోడెల కుమార్తె సైతం రాజకీయ అరంగేట్రానికి పావులు కదుపుతున్నారని అంటున్నారు. కానీ, ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అందుకు ధైర్యం చేసే పరిస్థితులు లేవని చెబుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే.