Rahul Murder Case : రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్ట్

విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్‌ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.

Rahul Murder Case : రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్ట్

Satyam

Koganti Satyam arrested : విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్‌ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. రాహుల్‌ మర్డర్‌ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని బెంగళూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొచ్చారు. రాహుల్‌ హత్య కేసులో కోగంటి సత్యం ఏ-2గా ఉన్నారు.

రాహుల్ హత్య జరిగినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. కోగంటి సత్యానికి రెండ్రోజుల క్రితమే పోలీసులు నోటీసులిచ్చారు. విజయవాడ విడిచీ ఎక్కడికీ వెళ్లొద్దని కోరారు. ఈ సందర్భంగా విచారణకు హాజరవుతానని చెప్పిన కోగంటి.. ఆ అజ్ఞాతంలోకి వెళ్లారు. కోరాడ విజయ్‌కుమార్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా కోగంటి సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోరాడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యం మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపై పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్‌ హత్య జరిగిన తర్వాత రెండ్రోజులు విజయవాడలోనే ఉన్న కోగంటి.. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయనపై మరిన్ని అనుమానాలు పెరిగాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కోరాడ విజయ్‌కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. రాహుల్‌ హత్య కేసులో ఎవరెవరి పాత్ర ఉంది..? ఆయన్ను ఎందుకు హతమర్చారు..? హత్యకు గల కారణాలపై పోలీసులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. కోగంటి సత్యం పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో పరారీలో ఉన్న కోగంటి సత్యాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో… అసలు నిజాలను వెలికితీయనున్నారు. అలాగే రాహుల్ హత్య కేసులో ముగ్గురు మహిళల ప్రయేయం ఉందని తేల్చిన పోలీసులు.. కోరాడ విజయ్‌కుమార్‌ భార్య పద్మజతో పాటు తల్లీ కూతుళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటికే రాహుల్ హత్య కేసులో విజయ్‌కుమార్‌, కోగంటి సత్యంతో పాటు ముగ్గురు మహిళల పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

రాహుల్ హత్య కేసులో బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. విచారణలో రాహుల్‌తో ఆర్థిక లావాదేవీలను ఈ కేసులోని ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌ ప్రస్తావించాడు. దీంతో విజయ్‌, రాహుల్ ఖాతాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. రాహుల్ ఖాతాలోకి ఎవరి నుంచి నిధులు వచ్చాయి?.. ఎవరికి నిధులు వెళ్లాయి? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు ఫోకస్ పెట్టారు.

కెనడాలో ఎమ్మెస్‌ చేసి వచ్చిన రాహుల్‌.. చెర్వుమాధవరంలో కోరాడ విజయ్‌కుమార్‌తో కలిసి గ్యాస్‌ సిలిండర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పాడు. 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో.. వంట గ్యాస్‌ సిలిండర్లు తయారు చేస్తున్నారు. కంపెనీ వాటాల విక్రయం విషయంలోనే రాహుల్, విజయ్ కుమార్‌ల మధ్య వివాదాలు తలెత్తినట్లు కోగంటి సత్యం 10టీవీతో చెప్పారు. విజయ్‌కుమార్‌ నుంచి రాహుల్ డబ్బులు తీసుకున్నాడని.. వాటిని ఇవ్వడంలో రాహుల్ ఆలస్యం చేసినట్లు తనకు తెలిసిందన్నారు.