Kodaveedu Kota : కొండవీడు కోటలో శతాబ్దాల కాలం నాటి దిగుడుబావి..

కోండవీడు పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది రెడ్డిరాజుల వైభవం.. కొండవీడు ఖిల్లాను రాజధానిగా రెడ్డిరాజులు క్రీస్తు పూర్వం 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.

Kodaveedu Kota : కొండవీడు కోటలో శతాబ్దాల కాలం నాటి దిగుడుబావి..

Kodaveedu Kota

Kondaveedu Kota Khilla Dig Well : కోండవీడు పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది రెడ్డిరాజుల వైభవం.. కొండవీడు ఖిల్లాను రాజధానిగా రెడ్డిరాజులు క్రీస్తు పూర్వం 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు. 14 శతాబ్ధంలో నిర్మించిన ఈ కోటలో మొత్తం 21వరకు నిర్మాణాలు ఉన్నాయి. కొండల నడుమ సుందర ప్రదేశంలో ఈ కోటను నిర్మించగా అందులో దేవాలయాలు, కోట ప్రాకారాలు శిధిలావస్ధకు చేరి ఉన్నాయి. వాటిని పునరిద్ధరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆపనులు కొనాసాగుతున్నాయి. ఇప్పటికే కొండపైకి వెళ్ళేందుకు ఎపి ప్రభుత్వం రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసింది.

కొండవీడు పరిసరాల్లో ఇప్పటికీ మరుగునపడిపోయి ఉన్న అనేక ఆనవాళ్ళు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా రెడ్డిరాజుల కాలం నాటి అతిపెద్ద దిగుడు బావిని గుర్తించారు. 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు కలిగి ఉన్న ఈ భావిని 14వ శతాబ్ధంలో రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు త్రాగునీటి అవసరాల కోసం వినియోగించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పురాతనమైన బావిని చరిత్ర ఆనవాలుగా అందించేందుకు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి బావిచుట్టూ ఉన్న ముళ్ళ పొదలను తొలగించి శుభ్రపరిచారు.

దిగుడు బావి ఘాట్ రోడ్డు ప్రక్కనే బయల్పడింది. ఈ తరహా బావులను సంస్కృతంలో” వాపి” అంటారు. మామూలు బావి కి ఈ బావి కి ఉన్న తేడా మామూలు బావులు లోపలికి దిగి నడిచి వెళ్ళడానికి వీల్లేదు. ఈ బాబి రెడ్డి రాజుల గృహ రాజ సౌధానికి అతి సమీపంలో ఉంది, అంటే రెండు వందల మీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఈ బావిలోని నీరు రాజుగారి గృహ అవసరాలకు వాడి ఉంటారని అనుకోవచ్చు. అయితే జంతువు లకు కూడా ఈ బావిలోని నీరు వాడి ఉండటానికి అవకాశం ఉంది . ఎందుకంటే కోటలో పెద్ద సంఖ్యలో ఏనుగులు గుర్రాలు ఉంటాయి. వాటికి విడిగా నీరు బయట అందించడం కంటే ఈ దిగుడు బావి కి తీసుకువచ్చి నీరు తాగించడం సులభం.

రెడ్డి రాజులు కొండవీటి కోట లోనూ మరియు కింద భాగంలో రాజ నివాసాలు ఉన్న చోట అనేక బావులు తవ్వించారు. ఇక్కడ బావులు చాలా లోతుగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంత ప్రజలు’ కొండవీటి చాంతాడు’ అనే సామెతను ఉపయోగిస్తుంటారు. రెడ్డిరాజులు తాగునీటి కోసం వ్యవసాయ నీటి పారుదల కోసం తమ రాజ్యంలో విరివిగా బావులు తవ్వించారు. ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో రెడ్డి రాజుల కాలంలో తవ్వించిన నూతులు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో విరివిగా కనిపిస్తాయి. ఇటుకలతో గోడలు కట్టారు. అమలాపురం ప్రాంతంలో ఈ బావులను రెడ్డి బావులు అని అంటారు.

కొండవీడు కోట పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి ఇంకా ఉన్నాయి పురావస్తు శాఖ వారు ఈ బావులు మీద శ్రద్ధ పెట్టి తవ్వకాలు చేపట్టివీటిని వెలుగులోకి తీసుకు వస్తే బాగుంటుంది అని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి పురావస్తు శాఖను కోరారు. స్థానికులు ఈ బావి పూర్తి స్వరూపాన్ని ఇంతవరకు చూడలేదు. కరువు పని కార్మికులతో, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ సంయుక్తంగా కన్వీనర్ కల్లి శివారెడ్డి నేతృత్వంలో ఈ బావిని వెలుగులోకి తీసుకువచ్చారు. స్థానికులు తో పాటు పర్యాటకులు కూడా ఈ బావిని చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూపరులు దీనిని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాచీన మరుగునపడిన కట్టడాలను కొండవీడు కోట అభివృద్ధి కమిటీ వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని కమిటీ కన్వీనర్ శివారెడ్డి తెలిపాడు.