Water Wastage : నిన్నటిదాకా నీటి కోసం గొడవలు, ఇప్పుడు సముద్రం పాలు

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వాడుతున్నారు అంటూ ఏపీ పై తెలంగాణ నేతలు, వాళ్లే నీరు అందకుండా చేస్తున్నారంటూ తెలంగాణపై ఏపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు.

10TV Telugu News

Water Wastage : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వాడుతున్నారు అంటూ ఏపీ పై తెలంగాణ నేతలు, వాళ్లే నీరు అందకుండా చేస్తున్నారంటూ తెలంగాణపై ఏపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రాజెక్టుల విషయంలోనూ మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. నీటి వినియోగం సంగతి పక్కన పెడితే కేవలం 26 రోజుల వ్యవధిలోనే 311 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. 2020-21 ఏడాదిలో కృష్ణా, గోదావరి జలాలు దాదాపుగా 4వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసాయి. అంటే, వృథా అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవంగా వర్షాకాలంలో ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ సీజన్ లో మరో రెండు నెలల సమయం ఉంది. ఇప్పటికే పెద్దగా వర్షాలు పడింది లేదు. ముందు ముందు మాత్రం భారీ వర్షాలు పడతాయి. నీటి ప్రవాహం భారీగానే ఉంటుందనే అంచనాలున్నాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను తీసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తారు. సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంటే, మరో వారం రోజుల పాటు నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంది.

జూలై నెలలో ఇప్పటివరకు ఏకంగా 311 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయి. అందులో గోదావరి వాటా 273.56 టీఎంసీలు కాగా, కృష్ణా వాటా 37.45 టీఎంసీల నీరు ఎవరూ వాడుకోకుండా వృథా అయ్యాయి. ఈ ఏడేళ్ల కాలంలో రెండు బేసిన్లలో కలిపి 17వేల టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 15వేల 259 టీఎంసీలు గోదావరి జలాలు ఉంటే, 2వేల 171 టీఎంసీలు కృష్ణా జలాలున్నాయి. అంటే.. ఏడాదికి సగటున 480 టీఎంసీలు కృష్ణా జలాలు, 3వేలకు పైగా టీఎంసీల గోదావరి జలాలు వృథా అవుతున్నాయి. వాస్తవంగా తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని వందల టీఎంసీల నీటి విషయంలోనే గొడవ వస్తోంది. అలాంటిది ఏకంగా వేల టీఎంసీల జలాలు వృథా అయితే పరిస్థితి ఏంటి? వాటాల విషయంలో గొడవ పడుతున్న రెండు రాష్ట్రాలు వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకోలేవా? జలాలు సముద్రం పాలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయంపై దృష్టి పెట్టలేకపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది.

వాస్తవానికి కృష్ణాలో నీటి లభ్యత తక్కువే అయినా రెట్టింపు వివాదాలు ఉన్నాయి. అంతేకాక ఈ నది పరివాహక ప్రాంతాల్లో కరువు ఎక్కువగా ఉంటోంది. కృష్ణాలో జలాల లభ్యత పెద్దగా లేనందున గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం కోసం ఉమ్మడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు కూడా జరిగాయి. దాదాపు 80వేల కోట్లతో రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటికి ఒక టీఎంసీ శ్రీశైలానికి, మరో టీఎంసీ సాగర్ కు తరలించేలా ప్రాజెక్టుల నిర్మాణానికి చర్చలూ జరిగాయి. అయితే వీటిపై ముందడుగు పడలేదు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నింటిని బోర్డు పరిధిలోకి తెస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నోటిషికేషన్ ఇచ్చింది. దాంతో 80 రోజుల్లో ప్రాజెక్టులన్నీ ప్రత్యక్షంగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి ఫుల్ స్టాప్ పడి, నీటి వృథా అరికట్టే చర్యలపైనా ప్రభుత్వాలు దృష్టి పెడతాయా? లేదా? అన్నది చూడాలి.

10TV Telugu News