తేలని నీటి రగడ : KRMB ముసాయిదాకు ఒకే చెప్పిన ఏపీ, అభ్యంతరం చెప్పిన తెలంగాణ

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 07:03 AM IST
తేలని నీటి రగడ : KRMB ముసాయిదాకు ఒకే చెప్పిన ఏపీ, అభ్యంతరం చెప్పిన తెలంగాణ

Krishna River KRMB daft : – కృష్ణా నీటి జ‌లాల విష‌యంలో మొద‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోంది. రెండు రాష్ట్రాలు ఒక‌రిపై మ‌రొక‌రు చేసుకునే..ఫిర్యాదుల ప‌రంప‌ర కూడా కొన‌సాగుతూనే ఉంది. కృష్ణా జ‌లాల అంశ‌మే ప్రధాన ఏజెండాగా రెండు సార్లు అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగినా.. స‌మ‌స్యలు మాత్రం కొలిక్కి రాలేదు.

రంగంలోకి కృష్ణా నది నీటి యాజమాన్యం : – 
దీంతో కృష్ణా న‌దీ నీటి యాజ‌మాన్య బోర్డు రంగంలోకి దిగింది. న‌దిపై నిర్మిత‌మైన‌, నిర్మించ‌బోయే వాటిని పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకుంటామ‌ని ముసాయిదా సిద్ధం చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తిని కూడా ఆయా ప్రాజెక్టుల వారిగా నిష్పత్తి ప్రకారం రాష్ట్రాల‌కు పంపిణీ చేస్తామ‌ని బోర్డు పేర్కొంది.

KRMB త‌యారు చేసిన ముసాయిదాపై బిన్నాభిప్రాయాలు : – 
KRMB త‌యారు చేసిన ముసాయిదాపై రెండు తెలుగు రాష్ట్రాలు భిన్నమైన వాద‌న‌లు వినిపించాయి. బోర్డు చేసిన ప్రతిపాద‌న‌ల‌పై ఏపీ పూర్తిగా మ‌ద్దతు తెలిపింది. బోర్డు ఆధీనంలో ఉంటే.. ఎలాంటి వివాదాలు ఉండ‌వంటూ ఏపీ చెప్పింది. పైగా నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉండ‌టంతో… కుడికాల్వకు నీటి విడుద‌ల విష‌యంలో ప్రతీసారి ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని చెప్పింది. ప్రాజెక్టుల‌న్నీ బోర్డు ప‌రిధిలో ఉంటే వాటా ప్రకారం కేటాయింపులు స‌వ్యంగా సాగుతాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

తెలంగాణ ప్రభుత్వం వాదన : – 
తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన వాద‌న‌ను వినిపించింది. రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించే విధంగా కేంద్రం వ్యవ‌హ‌రించ‌డం క‌రెక్ట్‌ కాద‌ని… స‌మాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తోంద‌ని చెప్పింది. అంతేకాదు విభ‌జన చ‌ట్టం ప్రకారం సెక్షన్ -85 నిబంధ‌న‌ల మేర‌కు … సాగు నీటి ప్రాజెక్టుల విష‌యంలో బోర్డు కేవ‌లం ప‌ర్యవేక్షణ మాత్రమే చేయాలి త‌ప్ప… పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డం కుద‌ర‌ని స్పష్టం చేసింది. బోర్డు త‌యారు చేసిన ముసాయిదాను తాము వ్యతిరేకిస్తున్నట్లు లేఖ‌లో పేర్కొంది.

కేంద్ర వైఖరిపై ఉత్కంఠ : – 
ఫైన‌ల్ గా కృష్ణా బోర్డు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాద‌న‌పై కేంద్రం ఎలా వ్యవ‌హ‌రించ‌నుంద‌నేది సస్పెన్స్ గా మారింది. బోర్డు త‌యారు చేసిన ముసాయిదాకు కేంద్రం ఆమోద‌ ముద్ర వేస్తే… ప్రాజెక్టుల నిర్వహ‌ణ‌, సిబ్బంది మొత్తం బోర్డు ప‌రిధిలోకి వెళ్లనుంది. జూరాలతో మొదలు పెట్టుకొని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలతో పాటు ప్రకాశం బ్యారేజ్ వరకు ప్రాజెక్టులు వాటిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలన్నీ కూడా బోర్డు పరిధిలోకి వెళ్తాయి.