కురిచేడు శానిటైజర్ ఘటన.. శ్రీనివాస్ ఎవరు ? షాకింగ్ విషయాలు

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 09:40 AM IST
కురిచేడు శానిటైజర్ ఘటన.. శ్రీనివాస్ ఎవరు ? షాకింగ్ విషయాలు

కురిచేడు శానిటైజర్‌ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కీలక నిందితుడు శ్రీనివాస్‌తో పాటు మిథైల్ క్లోరిఫైడ్ రసాయనాన్ని సరఫరా చేసిన షేక్ దావూద్, మహమ్మద్ ఖాజీ, డిస్ట్రిబ్యూటర్ కేశవ్ అగర్వాల్ సిట్ బృందం అదుపులో తీసుకుంది.

మద్యానికి బదులు శానిటైజర్‌ తాగి 16 మంది చనిపోయిన ఘటనపై సిట్‌ అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. పేరు మోసిన విత్తన ఉత్పత్తి కంపెనీలు విత్తన శుద్ధిలో ఉపయోగించిన అనంతరం వేస్టేజ్‌గా పడి ఉన్న రసాయనాలను కొనుగోలు చేసి శానిటైజర్‌లో వాడినట్లు సిట్ నిర్ధారించింది. మరోవైపు సిట్ అదుపులో కురిచేడు మెడికల్ షాపుల నిర్వాహకులు సుధాకర్, ఫణి, సుబ్బారావు, రమేష్, సురేంద్ర ఉన్నారు.

ఇక శానిటైజర్‌ నిర్వాహకుడైన సాలె శ్రీనివాస్‌ను సిట్‌ విచారించి అన్ని కోణాల్లో కూపీ లాగింది. పేదరికంలో ఉన్న శ్రీనివాస్‌ తొలుత ఓ యజమాని వద్ద వాహనాలకు వాటర్‌ సర్వీసింగ్‌ చేసే పనిలో చేరినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం సొంతంగానే వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు.

లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో శానిటైజర్ల తయారీపై చేసిన వీడియోను చూసి శ్రీనివాస్‌ ఆకర్షితుడయ్యాడు. దీంతో వెంటనే ఇంట్లోనే శానిటైజర్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన కూతురుకు చెందిన బంగారు వస్తువులను అమ్మి 4వేల 500 నగదు సమీకరించుకున్నాడు.

ఆ నగదుతో శానిటైజర్‌ తయారీకి కావాల్సిన ముడిసరుకులను కొని తొలుత ఇంట్లోనే శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించిన పదిరోజుల్లోనే బిజినెస్ సక్సెస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు.

అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్‌ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్‌ రోడ్డులో పర్‌ఫెక్ట్‌ కెమికల్స్‌ అండ్‌ సాల్వెంట్స్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. అంతేగాక.. తయారు చేసిన శానిటైజర్‌లను తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను శ్రీనివాస్‌ నియమించుకుని అక్రమ దందాను యదేచ్చగా సాగించాడు శ్రీనివాస్.

అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో శ్రీనివాస్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో బాధ్యతలను తమ్ముడికి అప్పగించాడు. పెరిగిన ఖర్చులకు తోడు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్‌ ఆల్కహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి శ్రీనివాస్‌ విక్రయాలు సాగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో తల దాచుకున్నాడు. అయితే శ్రీనివాస్‌ ఆచూకీని గుర్తించిన సిట్‌ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది.