Kurnool Airport : నేడు కర్నూలు ఎయిర్ పోర్టు ప్రారంభం

కర్నూలు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. నిర్మాణం పూర్తయిన ఓర్వకల్లు విమానాశ్రయం నేడు జాతికి అంకితంకానుంది.

Kurnool Airport : నేడు కర్నూలు ఎయిర్ పోర్టు ప్రారంభం

Kurnool Airport Opens Today

Kurnool Airport opens today : కర్నూలు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. నిర్మాణం పూర్తయిన ఓర్వకల్లు విమానాశ్రయం నేడు జాతికి అంకితంకానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 28 నుంచి ఉడాన్ విమాన సర్వీసులు కర్నూలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

153 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించారు. ఈ నెల 28 నుంచి ఇండిగో విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తొలి విమానం కర్నూలు నుంచి బెంగళూరుకు ఎగరనుంది. కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు.

కానీ నాటి పరిస్థితుల కారణంగా ఎయిర్‌పోర్టు నిర్ణయానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఆ తర్వాత 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద వెయ్యి 8 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే భూ సేకరణ, ఇతర అనుమతుల్లో తీవ్ర జాప్యం కారణంగా.. ఎయిర్‌ పోర్టు నిర్మాణం ఆలస్యమైంది. 2019 జనవరి 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించినప్పటికీ.. రాకపోకలకు అనుమతులు మాత్రం రాలేదు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. కర్నూలు విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు సుమారు 75 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్‌, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఇతర అధికారులతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌, ఐదు ఫ్లోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, అడ్మిన్ బిల్డింగ్‌, పోలీస్‌ బ్యారక్‌, ప్యాసింజర్‌ లాంజ్‌, వీఐపీ లాంజ్‌, ప్రత్యేక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, వాటర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌.. విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతులిచ్చింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అనుమతులు రావడంతో పాటు… ఇప్పుడు ఏరో డ్రోమ్‌ లైసెన్స్‌కు కూడా డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌క్లియర్‌ అయ్యింది.