Kurnool Airport : కర్నూలు ఎయిర్ పోర్టు రెడీ.. 28 నుంచే ఇండిగో విమానాలు

Kurnool Airport : కర్నూలు ఎయిర్ పోర్టు రెడీ.. 28 నుంచే ఇండిగో విమానాలు

Kurnool Airport To Be Inagurated Soon

Kurnool airport inaugural : కర్నూలు ప్రాంతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కర్నూలు విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు వద్ద నిర్మించిన దీన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.హర్‌దీప్‌సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 28 నుంచి ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి.

కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన మరణం తరువాత ఆ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. చివరకు 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అప్పటి పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఏడాది కాలంగా సీఎం వైఎస్‌ జగన్ కర్నూలు విమానాశ్రయ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.

పెండింగ్‌లోని అన్ని పనులను పూర్తి చేయించే బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు అప్పగించారు. ఆయన కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ కేవలం ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. గతంలో మంజూరైన నిధులకు అదనంగా రూ.75 కోట్లను విడుదల చేయించారు. ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, అడ్మిన్‌ బిల్డింగ్, పోలీస్‌ బ్యారక్, ప్యాసింజర్‌ లాంజ్, వీఐపీ లాంజ్, సబ్‌స్టేషన్, వాటర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు.

2019లో ఏటీసీ, 2020 జనవరి 16న డీజీసీఏ అనుమతులు లభించాయి. ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ న్యూఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌క్లియర్‌ అయ్యింది. కర్నూలు ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడి పారిశ్రామిక రంగానికి ఎంతో ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.