Y.S.Vijayamma: వెళ్ళాలా.. వద్దా.. విజయమ్మ సమావేశంపై మాజీల తర్జన భర్జన!

వైఎస్ విజయమ్మ సమావేశం నిర్వహించనుండడం.. ఈ సమావేశానికి ఆమె భర్త, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రులుగా పనిచేసిన వారికి, వైఎస్ఆర్ సన్నిహితులకు ఈ సమావేశానికి ఆహ్వానాలు..

Y.S.Vijayamma: వెళ్ళాలా.. వద్దా.. విజయమ్మ సమావేశంపై మాజీల తర్జన భర్జన!

Y.s.vijayamma

Y.S.Vijayamma: వైఎస్ విజయమ్మ సమావేశం నిర్వహించనుండడం.. ఈ సమావేశానికి ఆమె భర్త, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రులుగా పనిచేసిన వారికి, వైఎస్ఆర్ సన్నిహితులకు ఈ సమావేశానికి ఆహ్వానాలు పంపారనే ప్రచారం గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సమావేశానికి ఆహ్వానాలు అందుకున్న నేతలు వెళ్ళాలా.. వద్దా అనే సందిగ్ధంలో తర్జన, భర్జన పడుతున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.

సెప్టెంబరు 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ పదవులు అనుభవించిన నేతలకు, వైఎస్ఆర్ తో సన్నిహితంగా మెలిగిన నేతలకు ఆహ్వానాలు కూడా అందినట్లు తెలుస్తుండగా.. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయమ్మ ఆహ్వానాలలో తెలిపినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు కూడా విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానించినట్లు చెప్పుకుంటుండగా ఇందులో ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలు, ప్రస్తుత వైసీపీలో ముఖ్య నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు కొందరు మాజీలు, ఏపీలో వైసీపీకి చెందిన నేతలు ఇప్పుడు ఈ సమావేశంపై డైలమాలో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

విజయమ్మ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ షర్మిల పార్టీ వ్యవహారాలలో కీలకంగా కనిపిస్తున్నారు. షర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సభలో విజయమ్మనే హైలెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా అనే ఆలోచనలో కొందరు వైసీపీ నేతలు సలహాలు, సూచనలు తీసుకొనే పనిలో ఉండగా.. తెలంగాణలో మరికొందరు సీనియర్ నేతలు కూడా స్పష్టత లేని రాజకీయాలలో వేలు పెట్టడం అవసరమా అనే ధోరణిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

మరి, ఈ సమావేశానికి ఎంతమంది నేతలు హాజరవుతారు.. అసలు సమావేశం ఉంటుందా.. లేక వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఆయనకు నివాళితోనే సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కాగా, 2009లో వైఎస్ఆర్ చనిపోగా ఇప్పటి వరకు ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి కాగా అసలు ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశ్యం ఏదైనా ఉందా.. లేక వైఎస్ఆర్ గుర్తుగా విజయమ్మ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంది.