ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు లైన్ క్లియర్

  • Published By: bheemraj ,Published On : November 2, 2020 / 12:30 AM IST
ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు లైన్ క్లియర్

RTC bus services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సోమవారం మధ్యాహ్నం అంతరాష్ట్ర ఒప్పందం కుదరనుంది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆ వెంటనే రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిచే అవకాశం ఉంది.



టీఎస్ ఆర్టీసీ కోరినట్లుగా లక్షా 50 వేల కిలో మీటర్ల మేరకే బస్సులు తిప్పేందుకు ఏపీ అంగీకరించింది. దీంతో పాటు కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను తగ్గించుకోనుంది. పరిమిత సంఖ్యలో, పరిమిత రూట్లలోనే ఆర్టీసీ బస్సులను నడపనుంది. కరోనా తర్వాత రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు సడలించినా.. ఏపీ, తెలంగాణల మధ్య బస్సులు రోడ్డెక్కలేదు.



అంతర్రాష్ట్ర ఒప్పందంపై పీఠముడి పడింది. రెండు నెలలుగా చర్చలు జరుగుతున్నా…ఫలితం లేకపోయింది. మొదట కిలో మీటర్ల విషయంలో పేచి నడిచింది. దీంతో ఏపీ 60 వేల కిలోమీటర్లు తగ్గించుకుంది.



అయితే తెలంగాణ ఆర్టీసీ మాత్రం మరో 60 వేల కిలో మీటర్లు తగ్గించుకుని లక్షా 50 వేల కిలో మీటర్లకు పరిమితం కావాలని పట్టుబట్టింది. కిలో మీటర్లు తగ్గించుకునేందుకు అంగీకరించిన ఏపీఎస్ ఆర్టీసీ.. బస్సులు పెంచుకోవాలని సూచించింది.

అయితే బస్సుల సంఖ్య పెంచేందుకు తెలంగాణ అంగీకరించలేదు. చివరకు ఏపీఎస్ ఆర్టీసీ కిలో మీటర్ల విషయంలో రాజీ పడింది. అయితే రూట్ల విషయంలో పేచి మాత్రం తెగలేదు. విజయవాడ, హైదరాబాద్ రూట్లలోనే బస్సులు తిప్పాలని, మిగిలిన మార్గాల్లో బస్సులను భారీగా తగ్గించాలని తెలంగాణ ఆర్టీసీ పట్టుబట్టింది. దీనిపై పలుమార్లు చర్చలు సాగాయి. చివరకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కొలిక్కివచ్చింది.