వేగం పెంచిన లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ

వేగం పెంచిన లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ

ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త సదుపాయాలు కల్పించడమే కాదు. సురక్షితంతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే వ్యవస్థ కొత్త ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే పలు రైళ్ల ప్రయాణ సమయాలను తగ్గించుతూ గమ్యస్థానాలకు వేగం చేరుకునే సదుపాయం కల్పించింది. 

ఈ వేగం పెంపు 2020 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు అత్యంత వేగంగా చేరుకునే రైలుగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌‌ను సిద్దం చేయనున్నారు. సవరించిన సమయ వివరాల ప్రకారం.. 5 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. తిరుగుప్రయాణంలో 4.50 గంటల్లోనే సికింద్రాబాద్‌ చేరనుంది.

లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (నం.12796/12795) వేగం పెరగనుంది. ఉదయం 4గంటల 40నిమిషాలకు లింగంపల్లి నుంచి బయల్దేరే రైలు 5.30కి సికింద్రాబాద్‌కు, 10.45 గంటలకు విజయవాడ చేరుకుంటోంది. మార్పులు చేసిన తర్వాత 15 నిమిషాల ముందుగా ఉదయం 10.30కే చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.30కి విజయవాడలో బయల్దేరి రాత్రి 11.35కి లింగంపల్లికి చేరుకునే రైలు.. కొత్త కాలపట్టిక ప్రకారం 20 నిమిషాల ముందుగానే అంటే రాత్రి 11గంటల 15నిమిషాలకే చేరుకుంటుంది.

కొత్త ప్రయాణవేళలు: 
* లింగంపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ (నెం.12796): లింగంపల్లి, బేగంపేట స్టేషన్ల నుంచి అదే సమయానికి బయల్దేరినప్పటికీ సికింద్రాబాద్‌కు 5.20కి బదులుగా 5.25కి, గుంటూరుకు 9.40కి బదులు 9.20కి, మంగళగిరికి 10.09కి బదులు 9.42కి, విజయవాడకు 10.45కి బదులు 10.30కి వెళ్తుంది. 

* విజయవాడ-లింగంపల్లి ఇంటర్‌సిటీ (నెం.12795): విజయవాడ, మంగళగిరి, గుంటూరు స్టేషన్ల నుంచి బయల్దేరే సమయాల్లోనూ మార్పులేకపోయినా.. సికింద్రాబాద్‌కు రాత్రి 10.35కి బదులు 10.20కి, బేగంపేటకు 10.49కి బదులు 10.34కి, లింగంపల్లికి రాత్రి 11.35కి బదులు 11.15కి సమయానికి వస్తుంది.