ఇప్పటికే రూ.2కోట్లు ఖర్చయ్యాయి, ఇంకెంత పెట్టాలో.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల తిప్పలు

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 11:11 AM IST
ఇప్పటికే రూ.2కోట్లు ఖర్చయ్యాయి, ఇంకెంత పెట్టాలో.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల తిప్పలు

Visakha Local Body Elections:విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలంటే మినీ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఇటీవల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేయగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో అభ్యర్థులు ముప్పతిప్పలు పడుతున్నారు. పార్టీ పెద్దల దృష్టిలో పడి డివిజన్‌లోని ప్రత్యర్థులతో తలపడుతూ చివరి నిమిషంలో సీటు దక్కించుకోవడం ఒక ఎత్తు. సీటు వచ్చిన తర్వాత వాయిదా పడటం, దానిని తిరిగి నిలబెట్టుకోవడం, అటు పెద్దల మనసు మారకుండా కాపాడాకోవడం కష్టంగా ఉందంటున్నారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్‌ను నిలుపుకోవడం కూడా తలకు మించిన భారంగా మారుతోందట. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు.

నగరంలో పదవులు చాలా కాస్ట్‌లీ:
విశాఖలో వార్డు అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసుకోవడం అంటే రాజకీయంగా ఎంతో అదృష్టం ఉండటమే. మహా విశాఖ నగర పాలక సంస్థలో కార్పొరేటర్ అంటే భవిష్యత్తులో వచ్చే విలువ ఊహించలేనిది. ప్రభుత్వం పాలనా రాజధానిగా విశాఖను చేస్తున్న నేపథ్యంలో నగరంలో పదవులు చాలా కాస్ట్‌లీగా మారిపోతున్నాని అంచనా వేస్తున్నారు. కార్పొరేటర్ సీటు కోసం ఎన్నాళ్లుగానో
వేచిన చూస్తున్న నేతలంతా పావులు కదుపుతూ వచ్చారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు పచ్చజెండా ఊపడంతో అందరిలోనూ ఒక్కసారిగా జోష్‌ మొదలైంది.



కార్పొరేటర్ సీటుపై గురిపెట్టిన వారంతా పైరవీలు చేసుకుని కొందరు సీట్లు సంపాదించారు. వైసీపీ వ్యవహారాలను చూస్తున్న విజయసాయిరెడ్డి దృష్టిలో పడి కొందరు, స్థానిక ఎమ్మెల్యేల సిఫారసు మేరకు మరికొందరికి, నేరుగా పార్టీ అధిష్టానం సూచనల మేరకు మరికొందరికి సీట్లు దక్కాయి. వైసీపీ అధికారంలో ఉండడంతో 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయగల వారికే
అన్ని పార్టీలు కార్పొరేటర్ సీటు ఖరారు చేశాయట. వైసీపీ కూడా ఇదే రీతిలో ఆర్థిక బలంతో పాటు జనం అండ వారిని చూసి ఎంపికి చేసిందట. 98 మంది అభ్యర్థుల్లో చాలా చోట్ల అసమ్మతి ఊసే లేకుండాపోయింది. అయితే ఐదారు చోట్ల మాత్రం రెబల్స్‌గా నామినేషన్లు కూడా వేశారు.

ఇప్పటికే రూ.2 కోట్లు ఖర్చు పెట్టి అభ్యర్థులు:
ప్రచారాలు ఊపందుకుని, నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత అనూహ్యంగా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే చాలామంది ప్రచారం కోసం చాలా ఖర్చు పెట్టారు.
ప్రచార ర్యాలీలతో పాటు, వార్డుల్లో వ్యతిరేకులను తమ వైపు తిప్పుకునేందుకు బాగానే ఖర్చు పెట్టేశారట. దాదాపు ఒకటి రెండు కోట్ల రుపాయలను అభ్యర్థులు ఖర్చు చేశారని చెబుతున్నారు.



ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు:
ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా అభ్యర్థులు వెనక్కి తగ్గలేదట. కరోనా సాయం పేరిట నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయా డివిజన్లలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అభ్యర్థులపైనే భారం పడుతోందని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సైతం భారాన్ని తమపైనే మోపుతున్నారని అభ్యర్థులు లబోదిబోమంటున్నారట. ప్రభుత్వం
ప్రవేశపెడుతున్న పలు పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు డివిజన్లలో నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు అతిథులుగా వస్తుండటంతో ఆయా ఏర్పాట్ల భారమంతా కార్పొరేటర్ అభ్యర్థులపైనే
పడుతోందట.

రోజువారీ మద్యం, విందు వంటి అవసరాలు తీర్చలేక తంటాలు:
పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఇదే రీతిన ఎమ్మెల్యేలు తమ చేతి చమురు వదలకుండా ఉండేందుకు కార్పొరేటర్ అభ్యర్థులకు సమాచారం ఇచ్చి, వారి నెత్తిన భారాన్ని పడేస్తున్నారట. దీంతో తమ జేబులు గుల్ల చేసేస్తున్నారంటూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. మరోవైపు తమ వెనుకున్న కేడర్‌కు రోజువారీ మద్యం, విందు వంటి అవసరాలు తీర్చుతూ రాజకీయ కార్యకలాపాల వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో? తమ జేబులకు ఇంకెంత భారం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారట.