ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు…. టీడీపీ, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పొత్తు కుదిరింది. టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 02:29 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు…. టీడీపీ, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పొత్తు కుదిరింది. టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పొత్తు కుదిరింది. టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది. లోకల్‌బాడీ ఎన్నికల్లో కలిసి వెళ్లాలని ఇరుపార్టీల నేతలు నిర్ణయించారు. మరో వామపక్షమైన సీపీఎంను కూడా తమ దారిలోకి తెచ్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. గెలుపుకు కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని చేజారకుండా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా పొత్తులు ఉంటాయి. ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీల మధ్య పొత్తు పొడుస్తోంది. ఇప్పటికే జనసే, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈనెల 12న ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని నిర్ణయించాయి. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు మరో కొత్త పొత్తు తెరమీదకు వచ్చింది. 

టీడీపీ, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు
తెలుగుదేశం పార్టీ, సీపీఐ ఈ ఎన్నికల్లో కలిసి పని చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కీలక  చర్చలు జరిపారు.  ఇవాళ మరోసారి సమావేశమై చర్చించనున్నట్టు రామకృష్ణ తెలిపారు. నేటి భేటీతో పొత్తుపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

ఉమ్మడిగా పొత్తుపై ప్రకటన చేసే అవకాశం
ఇవాళ టీడీపీ, సీపీఐ నేతలు మరోసారి భేటీ అవుతారు. పొత్తుపై పూర్తి స్థాయిలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం ఇరుపార్టీలకు చెందిన నేతలు ఉమ్మడిగా పొత్తుపై ప్రకటన చేసే అవకాశముంది.

టీడీపీతో పొత్తుకు సీపీఎం విముఖత!
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లడానికి సీపీఐ సిద్ధంగా ఉన్నా… మరో వామపక్ష పార్టీ అయిన సీపీఎం మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.  అమరావతి రైతుల పోరాటంలో సీపీఐ… టీడీపీతో కలిసి నడిచింది. జనసేనను వీడిన తర్వాత సీపీఐ టీడీపీకి దగ్గరయ్యింది. కానీ సీపీఎం మాత్రం ఒంటరిగానే వెళ్తోంది. సీపీఐ, సీపీఎం నేతలు తొలుత ఎన్నికల్లో కలిసి వెళ్లాలనే యోచన చేశారు. అయితే సీపీఐ మాత్రం అనూహ్యంగా టీడీపీతో జతకట్టేందుకు రెడీ అయిపోయింది. మరి సీపీఎం  ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తుందా…. లేక టీడీపీతో పొత్తుకు సై అంటుందా అన్నది ఇవాళో, రేపో తెలిసిపోనుంది.

కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్లేందుకు టీడీపీ రెడీ
బలమైన శత్రువును ఢీకొట్టాలంటే చిన్నచితకా మిత్రులందరి సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్ములానే టీడీపీ అధినేత చంద్రబాబు ఫాలో అవుతున్నారు. బలమైన వైసీపీపై ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే….  రాష్ట్రంలోని చిన్న చితకా పార్టీల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. సీపీఐని దగ్గర చేసుకున్న చంద్రబాబు.. సీపీఎంను కూడా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
 

See Also | పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటు… జగన్ వ్యూహం ఏంటి ?