ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈసీ ఏం చేయబోతోంది

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 07:42 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈసీ ఏం చేయబోతోంది

Local body elections in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు.



కరోనా ఉంటే ఎలా :-
ఓ వైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తుంటే… ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో కరోనా సెకండ్ వేవ్‌ వచ్చే ప్రమాదముందని… ప్రస్తుతానికి ఎన్నికల జోలికి వెళ్లకపోవడమే మంచిదంటోంది.



https://10tv.in/why-pendurthi-mla-annamreddy-adeep-raj-is-not-going-to-that-village/
మార్చి 07 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ : –
వాస్తవంగా మార్చి 7న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి. తొలిదశలో 333 జెడ్పీటీసీలు, 5వేల 352 ఎంపీటీసీలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.



ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవం : –
అప్పటికే 2వేల 129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, ఈ ఏకగ్రీవాలన్నిటినీ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని ఎస్‌ఈసీకి ఫిర్యాదు కూడా చేశాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ అప్పట్లో తప్పు పట్టింది.. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది.



ఎస్ఈసీ నిర్ణయం ఎలా ఉంటుంది : –
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించి మరొకరిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై రమేష్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించడంతో… తిరిగి ఎస్ఈసీగా నియమితులయ్యారు. ఇటీవల హైకోర్టులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పగా.. ఇదే విషయం ఎస్‌ఈసీకి చెప్పాలని కోర్టు సూచించింది. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.