స్థానిక ఎన్నికలు : నైరాశ్యంలో ప్రకాశం తెలుగు తమ్ముళ్లు..ఎందుకు

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 02:59 PM IST
స్థానిక ఎన్నికలు : నైరాశ్యంలో ప్రకాశం తెలుగు తమ్ముళ్లు..ఎందుకు

ఆ జిల్లా స్థానిక పోరులో వైసీపీ దూకుడును పెంచింది. ఎన్నికల సమయం తక్కువగా ఉండటంతో తన వ్యూహాలకు పదును పెడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగా స్థానిక సమరంలోనూ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది. అటు టీడీపీ మాత్రం వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నడిపించే నాయకత్వం లేక పసుపు దళం నిరాశలో కూరుకుపోయింది. స్థానిక ఎన్నికల సైరన్ మోగి రోజులు గడుస్తున్నా తెలుగు తమ్ముళ్లు మాత్రం భారం భరించేది నువ్వా..నేనా అనే రీతిలో లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. 

ప్రకాశం జిల్లాలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ దూసుకు పోతుంటే టీడీపీ మాత్రం వలసలతో సతమతమవుతోంది. ఇప్పటికే కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ఫ్యాన్‌ గాలికి ఫిదా అయ్యారు. దీంతో టీడీపీ క్యాడర్‌లో ఎన్నికల హడావిడి కనుచూపు మేరల్లో కనపడటం లేదు. కనీసం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించి కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకులు కూడా కరువయ్యారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా దామచర్ల జనార్దన్ పేరకే కొనసాగుతున్నారు తప్ప.. మునుపటిలా తన దూకుడును కొనసాగించలేక పోతున్నారనే విమర్షలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో మాదిరే స్థానిక సమరంలోనూ సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చిన నాటినుంచే తమ వ్యూహానికి పదును పెట్టింది అధికార పార్టీ. అందుకు ప్రతి నియోజక వర్గ ఇంచార్జ్ ఎమ్మెల్యేలను బాధ్యులుగా చేస్తూ ఎక్కడికక్కడ సమీక్షలు, సమావేశాలు, క్యాడర్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా విజయం సాధించాలనే భావనతో మంత్రి నుండి నియోజక వర్గ నేతల వరకు దూకుడును ప్రదర్శిస్తున్నారు. వైసీపీపై ప్రజల్లో అభిమానం ఆప్యాయత తగ్గలేదనే సంకేతాలను పంపాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.

గెలుపు వ్యూహాల్లో భాగంగా వైసీపీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా క్యాడర్ నడుచుకోవలసిన విధానం, ప్రజల్లోకి వెల్లవలసిన తీరు, అనుసరించవసిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.  ప్రత్యుర్థులు బలంగా ఉన్న ప్రాంతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని మంత్రులు బాలినేని, ఆదిమూలం సురేశ్‌, ఎంపీ మాగుంట తమ క్యాడర్‌కు హితబోధ చేయడం చూస్తే వైసీపీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు.

మరోవైపు జిల్లాలో టీడీపీకి దామచర్ల జనార్దన్, శిద్ధారాఘవరావు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ వంటి కీలక నేతలు ఉన్నా పార్టీకి వెన్ను దన్నుగా నిలవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీకి బాధ్యతగా వ్యవహరించే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. దీంతో పసుపు దళం నిరాశ నిస్పృహలో కూరుకుపోయింది. 

వాస్తవానికి టీడీపీ నేతలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. అందుకు వారి బలహీనతలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఉన్న కీలక నేతలు పారిశ్రామిక వేత్తలు కావడం.. అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్‌లు, పాటించవలసిన నిబంధనలు అతిక్రమించారని అధికారులు గుర్తించారు. భారీగా ఫెనాల్టీలు విధించేందుకు సిద్ధమవుతుండటంతో టీడీపీ నేతలు సైలెంట్‌ అయ్యారు. 

Read More : స్థానిక ఎన్నికల్లో వైసీపీ – బీజేపీ పొత్తు సక్సెస్ అవుతుందా ? విజయం సాధిస్తారా