మంత్రి అప్పలరాజుపై కర్నూలులో పోలీసులకు ఫిర్యాదు

మంత్రి అప్పలరాజుపై కర్నూలులో పోలీసులకు ఫిర్యాదు

Lodged A Complaint In Kurnool Police Station On Minister Appalaraju

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఓ న్యాయవాది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేసు పెట్టగా.. లేటెస్ట్‌గా ఒకరు కర్నూలు జిల్లాలో అదే పోలీస్ స్టేషన్లో కంప్లైన్ట్ చేశారు.

కరోనా మహమ్మారి మ్యుటెంట్‌ ఎన్‌-440కే వైరస్‌ విస్తరిస్తోందని అన్నారని కర్నూలు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్థకశాఖ, డెయిరీ, మత్స్యశాఖల మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి అప్పలరాజు కర్నూల్‌లో కరోనా కొత్తరకం మ్యుటెంట్‌ ఎన్‌-440కే వైరస్‌ విస్తరిస్తోందని అన్నారని పోతురాజు రవికుమార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి వ్యాఖ్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన మంత్రిపై వెంట చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యగా.. ఇప్పటివరకు మంత్రిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పూర్తి విచారణ అనంతరం నిబంధనలకు అనుగుణంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.