మదనపల్లె డబుల్ మర్డర్ : చికిత్స పొందుతున్న పురుషోత్తం, పద్మజలు

మదనపల్లె డబుల్ మర్డర్ : చికిత్స పొందుతున్న పురుషోత్తం, పద్మజలు

Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్‌ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్‌ వార్డులో వేర్వేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో సహా మహిళా కానిస్టేబుళ్లు రక్షణగా ఉన్నారు. ఆస్పత్రిలో వైద్యం పూర్తయ్యే వరకు మదనపల్లె సబ్‌ జైలు సిబ్బంది సైతం ఆస్పత్రిలోనే ఉండే అవకాశముంది.

తిరుపతి రుయా హాస్పిటల్‌లో కస్టోడియన్ కేర్‌ లేనందున వారిని విశాఖపట్నం మానసిక చికిత్స ఆస్పత్రికి రిఫర్‌ చేశారు వైద్యులు. దీంతో వారిని నిన్న విశాఖ తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు భార్యాభర్తలు ఇద్దరికీ రుయా సైక్రియాట్రీ విభాగంలో వైద్య చికిత్స చేశారు. వారి మానసిక స్థితి ఎలా ఉందో పరీక్షించారు. మదనపల్లెలో సంచలనం రేపిన అక్కాచెల్లెళ్లు హత్య కేసు మిస్టరీ ఇంకా వీడట్లేదు. ఆరోజు రాత్రి అసలేం జరిగిందనే విషయంపై క్లారిటీ రాలేదు.

ఉన్నత విద్యావంతుల ఇంట్లో జరిగిన విషాదం వెనక ఎవరి ప్రమేయమైనా ఉందా? మూఢ భక్తి.. మితిమీరిన విశ్వాసమే హత్యలకు పురికొల్పిందా అన్న ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమాధానాలు దొరకట్లేదు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం, పద్మజ దంపతులను బుధవారం ఉదయం మదనపల్లి సబ్ జైలు నుంచి విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు పోలీసులు తరలించారు. మదనపల్లె సబ్ జైలులో పద్మజ మానసిక స్థితి చాలా విచిత్రంగా ఉండేది. పగలు నిశ్శబ్దంగానే ఉండే పద్మజ…రాత్రి అయ్యేసరికి రెచ్చిపోయేది. శివ..శివ అంటూ గట్టిగా అరుపులు, కేకలు వేసేంది. ఆమె తీరుతో తోటి ఖైదీలు భయాందోళన చెందారు. నిద్రలేని రాత్రులు గడిపారు. పద్మజ భర్త పురుషోత్తం మాత్రం సబ్ జైల్లో నిత్యం ఏడుస్తూ కనిపించారని పోలీసులు తెలిపారు.