శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Makar Sankranti Brahmotsavam : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో ప్రధాన అర్చకులు ఉత్సవమూర్తులకు శోడోపచార పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో చిన్నారులకు సామూహిక భోగిపండ్లు పోశారు. రేగు పళ్లు, చెరుకు గడలతోపాటు పలురకాలు పూలను తలపై పోయడంతో బ్రహ్మరంధ్రం ప్రేరేపింపబడి దృష్టిలోపం నశిస్తుందని, గ్రహపీడలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

ఉత్సవాల్లో భాగంగా 2021, జనవరి 13వ తేదీ బుధవారం సాయంత్రం రావణ వాహణంపై శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపంలో వాహనంపై అధిష్టింపజేసి అర్చకులు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య కళాకారుల సంప్రదాయ నృత్యాల నడుమ మాడ వీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులను కటాక్షిస్తారని ఆలయ అధికారులు చెప్పారు.

చెంచుల ఆనవాయితీ ప్రకారం యేటా సంక్రాంతి రోజు జరగాల్సిన స్వామి అమ్మవార్ల దొంగ పెళ్లిని దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. చెంచుల ఆడపిల్లగా భావించే భ్రమరాంబ అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చిన మల్లికార్జునుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. దీన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో అమ్మవారిని అపహరించుకుపోయి మకర సంక్రాంతి రోజు దొంగ పెళ్లి చేసుకున్నాడని చరిత్ర. దీన్ని విశ్వసించి చెంచులు అనాధిగా ఇక్కడ సంక్రాంతి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కల్యాణం జరిపిస్తారు. 2021, జనవరి 14వ తేదీ గురువారం రాత్రి నిర్వహించనున్న కల్యాణానికి పరిసర ప్రాంతాల నుంచి సుమారు 150 చెంచుగూడేల నుంచి చెంచులు హాజరుకానున్నారు.