అడవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

అడవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

Man dies of electric shock in chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఒకరి ప్రాణం తీశాయి. గంగాధర మండలం కొట్రకోన గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో.. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి నీవా నదిలో చేపలు పట్టేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య, తమ్ముడికి గాయాలయ్యారు. గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కొట్రకోన గ్రామ సరిహద్దుల్లో బాలకృష్ణ అనే వ్యక్తి.. తన భార్య, తమ్ముడిని వెంటబెట్టుకుని నీవా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అడవిమార్గంలో రోడ్డుకు అడ్డంగా చెట్లపొదల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను బాలకృష్ణ గమనించలేదు. ఒక్కసారిగా ముగ్గురి కాళ్లకు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో బాలకృష్ణ తీవ్ర విద్యుత్ షాక్ గురయ్యారు. అలాగే సమీపంలో ఉన్న భార్య, తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

చికిత్స కోసం ముగ్గురిని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే లోపే బాలకృష్ణ చనిపోయారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పందుల కోసం విద్యుత్ తీగలను ఎవరు బిగించారనే కోణంలో విచారణ చేపట్టారు.

జిల్లాలో గంగాధర మండలంతోపాటు సమీప మండాల్లో పొలాలకు విద్యుత్ తీగలు బిగించుకోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. దీంతో పాటు అడవి పందులను మట్టుపెట్టేందుకు కొంతమంది వేటగాళ్లు రహస్యంగా అడవిలో విద్యుత్ తీగలు బిగుస్తంటారు. అడవి పందులను పట్టుకునేందుకు ఈ తరహా చర్యలకు పాల్పడుతుంటారు. ఈ విద్యుత్ తీగలు గుర్తించలేక అమాయకులు బలవుతుంటారు. సరిగ్గా ఇదే ఘటన గత రాత్రి చోటుచేసుకుంది.