అనంతలో అదృష్టవంతుడు, పొలంలో దొరికిన వజ్రం, లక్షాధికారి అయ్యాడు

  • Published By: naveen ,Published On : July 16, 2020 / 12:50 PM IST
అనంతలో అదృష్టవంతుడు, పొలంలో దొరికిన వజ్రం, లక్షాధికారి అయ్యాడు

అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికులు పొలాల బాట పట్టారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. దీని గురించి పోలీసులకు కూడా సమాచారం అందింది. దీంతో వారు రంగంలోకి దిగారు. వజ్రం గురించి ఆరా తీస్తున్నారు. దొరికిన వ్యక్తిని, దాన్ని కొనుగోలు చేసిన వ్యాపారిని ప్రశ్నిస్తున్నారు.

తొలకరితో రాయలసీమలో రత్నాల వేట, దొరికితే లక్షాధికారే:
వర్షాకాలం మొదలైందంటే చాలు రైతన్నల ఆనందానికి హద్దు ఉండదు. పంటలు వేసుకునేందుకు ఉపక్రమిస్తారు. ఇది సహజం. ఆ ప్రాంతంలో మాత్రం రైతులకే కాదు ప్రజలకూ ఆనందమే. ఎందుకంటే అక్కడ తొలకరి జల్లులు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. రత్నాల పంటలే పండుతాయి. చినుకు పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి. తొలకరి వర్షాలు పడితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. తొలకరి జల్లులు వారికి మరింత ప్రత్యేకంగా మారతాయి. తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. అయితే అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. వానాకాలం వచ్చిందంటే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాలతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలవుతుంది. పంట పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి.

Celtic field - Wikipedia

వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేట:
వజ్రాలను వెతకడానికి స్థానికులు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సైతం ఇక్కడికి వస్తుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్క వజ్రం దొరికినా జీవితం ధన్యమవుతుందని భావించి చాలామంది ఉద్యోగులు సైతం సెలవు పెట్టి మరీ వజ్రాల వెతుకులాటలో పడతారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 6 వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. కాగా, ఈ వజ్రాల వేట స్థానిక రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్న జనం డైమెండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కేస్తున్నారట. దీంతో పొలం దున్నేటప్పుడు తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

shepherd found diamond in kurnool district

కర్నూలులో గొర్రెల కాపరికి దొరికిన వజ్రం:
అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతంలో వర్షాలు పడటం మొదలైతే వజ్రాలు దొరుకుతాయనేది స్థానికుల నమ్మకం. దీంతో ప్రతి ఏటా వర్షాలు మొదలైన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంది. తొలకరి చినుకులు పడటం మొదలుకాగానే వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల కోసం పొలాల్లో తిరుగుతారు. ఈ ఏడాది కూడా మండలవాసులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వజ్రాలు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది తన కళ్లముందే చాలా మందికి వజ్రాలు దొరికాయని, తమకూ దొరుకుతాయని ఆశతో వచ్చామని కొందరు వ్యక్తులు చెప్పారు. కాగా, కొన్ని రోజుల క్రితమే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరి పంట పండింది. అతడికి వజ్రం దొరికింది. కానీ, ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకే విక్రయించాడు.