హలో..నేను సీఐని ఆ జుట్టేందిరా..వెంటనే గుండు గీయించుకో లేదంటే కేసు పెట్టి లోపలేస్తా..

  • Published By: nagamani ,Published On : October 24, 2020 / 11:30 AM IST
హలో..నేను సీఐని ఆ జుట్టేందిరా..వెంటనే గుండు గీయించుకో లేదంటే కేసు పెట్టి లోపలేస్తా..

Andrapradesh : man threats long hair persons calling him self police
‘‘ హలో..ఏందిరా చింపాంజీలాగా ఆ జుట్టు? వెంటనే గుండు చేయించుకో..లేకుండా కేసు బుక్ చేసి లోపలేస్తా జాగ్రత్త..అంటే ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి జుట్టు పొడవుగా పెంచుకునే మగవాళ్లకు ఓ అపరిచితుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవడో ఫోన్ చేశాడనీ నేను గుండు చేయించుకోవాలా? అనుకుని గుండు చేయించుకోకపోతే సదరు అపరిచితుడు మాత్రం ఊరుకోడు..ఎవడో ఫోన్ చేస్తే నేను జుట్టు తీయించుకోవాలా? అని అనుకుంటున్నావేమో..నేనెవరుకున్నావ్..పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు సదరు వ్యక్తి.


జుట్టు పొడవుగా పెంచుకునే మగవాళ్ల ఫోన్ నంబర్లు తెలుసుకుని వారి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు. మగవాళ్లు ఎవరైనా తల మీద ఆడవాళ్లలా జుట్టు పెద్దగా పెంచారో సదరు అపరిచితుడికి మండిపోతుంది. వెంటనే ఫోన్ చేస్తాడు. జుట్టు సరిగ్గా కట్ చేయించుకో లేదంటే గుండు గీయించుకో అని వార్నింగ్ ఇస్తాడు. తానో పోలీసునని, ఆడవాళ్లలా జుట్టు పెద్దగా పెంచుకుంటే కేసు పెడతానని చెబుతాడు. అతని హుంకరింపులు నిజమేనని నమ్మిన కొందరు ఎందుకొచ్చిన గొడవా అని జుట్టును కట్ చేయించుకుంటున్నారు.


వివరాల్లోకి వెళితే..సంగారెడ్డికి చెందిన మచుకూరి పండారి అనే వ్యక్తి..తాను సీఐని అని చెప్పుకుంటూ జుట్టు పెద్దగా పెంచుకునే మగవాళ్లకు ఫోన్ వార్నింగ్ లు ఇస్తున్నాడు. అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి జుట్టు కత్తిరించుకోవాలని బెదిరించాడు.


దీంతో బెదిరిపోయిన మణికుమార్ జుట్టును కత్తిరించుకున్నాడు. పండారి అంతటితో ఆగలేదు..భలే భలే నాకు భయపడ్డాడు అని చంకలు కొట్టుకుంటూమరోసారి మణికుమార్కు ఫోన్ చేసి జుట్టు కట్ చేయించుకోవటం కాదు మొత్తం గుండు చేయించుకోవాలని..లేకపోతే సైబర్ క్రైమ్ నేరంపై కేసు నమోదు చేస్తానని మణికుమార్‌ను బెదిరించాడు.


మణికుమార్ మళ్లీ భయపడిపోయి గుండు గీసుకుని ఫోటో తీసుకుని ఫోన్ చేసిన వ్యక్తికి ఆ ఫొటో పంపించాడు. దీంతో పండారి మరింతగా రెచ్చిపోయాడు తన ప్లాన్ భలే ఉందనుకుని ఫోటోలో అతని పక్కనే ఉన్న అతని అన్నను కూడా జుట్టు కత్తిరించుకోమని చెప్పాడు. దీంతో వారికి అనుమానం వచ్చింది. మణికుమార్ బంధువులు అనకాపల్లి పోలీసులను ఫిర్యాదు చేసి విషయం చెప్పారు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వీడెవడో సినిమాలు బాగా చూసినట్లుగానడుకుని కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తి నంబర్ తీసుకుని ఫోన్ చేయగా అసలు విషయం బైటపడింది.


పోలీసులు పండారిని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో పండారి చెప్పిన విషయాలు విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణలో పలువురు యువకులను బెదిరించి జుట్టు కత్తిరించుకునేలా చేశానని చెప్పాడు. సోషల్ మీడియాలో ప్రొఫైల్ ఫోటోల్లో తలపై జుట్టు ఎక్కువగా ఎవరికి ఉంటే వారి ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి బెదిరిస్తున్నానని చెప్పాడు. ఇదో అలవాటుగా మారి తన బెదిరింపులకు భయపడి జట్టు కట్ చేయించుకుంటుంటే తనకు భలే మజాగా ఉందని అందుకే జుట్టు ఎక్కువగా ఉండే మగవారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నానని చెప్పాడు.


అవన్నీ విన్న పోలీసులు ‘‘నీ పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయిందిరా’’అనుకుని గతంతో అతనిపై ఏమన్నా కేసులు నమోదయ్యాయేమోనని ఎంక్వయిరీ చేయగా వారి అనుమానం నిజమైంది. పండారిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పోలీసుల పేరు చెప్పి ఎవరైనా ఫేక్ కాల్ చేసి బెదిరిస్తే ఎవరూ భయపడవద్దని పోలీసులు సూచించారు.