మాన్సాస్ విద్యాసంస్థలు : నాడు బాబాయ్ చేసిందేంటి ? ఇప్పుడు అమ్మాయ్ చేస్తున్నదేంటి ?

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 09:26 AM IST
మాన్సాస్ విద్యాసంస్థలు : నాడు బాబాయ్ చేసిందేంటి ? ఇప్పుడు అమ్మాయ్ చేస్తున్నదేంటి ?

mansas Trust Ashok Gajapathi Raju Vs Sanchaita : ఏళ్ల చరిత్ర ఉన్న మాన్సాస్ ట్రస్ట్‌ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందా..? ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను భ్రష్టు పట్టించే విధంగా అడుగులు పడుతున్నాయా..? ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి నాటి రాజుల దాతృత్వాన్ని మంట గలుపుతున్నారా..? అంటే..అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇంతకి మాన్సాస్ విద్యా సంస్థల వ్యవహారంలో నాడు బాబాయ్ చేసిందేంటి.? ఇప్పుడు అమ్మాయ్ చేస్తున్నదేంటి.?



విజయనగరం రాజవంశీయులు : – 
విజయనగరం రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్‌కు కొత్త చైర్మన్‌గా సంచైత గజపతిరాజు వచ్చిన తర్వాత అన్ని వివాదాస్పద నిర్ణయాలే వెలువడుతున్నాయి. ఛైర్మన్ నియామకం నుంచి ప్రస్తుతం మహరాజా అటానమస్ కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారం వరకు అంతా గందరగోళంగా మారింది. ట్రస్టుకు సంబంధించి ఎప్పుడు..ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్నఆందోళన ఆ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది.



వివాదాలు : – 
సంచైత గజపతిరాజు ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ట్రస్టు వ్యవహారమంతా వివాదాల చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం మహరాజా అటానమస్ కళాశాలను ప్రైవేటీకరించేందుకు మాన్సాస్ ట్రస్టు యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఇప్పటిది కాదని…గతంలోనే జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.



https://10tv.in/corona-aid-anti-viral-immunity-booster-released-by-ankur-incubation-centre/
ప్రైవేటీకరణ ప్రతిపాదన : – 
అశోక్ గజపతిరాజు ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన సిద్ధమైందని, ఎందుకనో అది అప్పట్లో అమలు కాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అశోక్ గజపతిరాజు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటూనే, విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రతిపాదన మళ్లీ ఎందుకు తీసుకువచ్చారో ప్రస్తుత ఛైర్మనే చెప్పాలంటూ విమర్శించారు.



సంచైత విమర్శలు : – 
అయితే, ఇటీవల సంచైత మాత్రం ట్విటర్ వేదికగా అశోక్ గజపతిరాజుపై ఆరోపణలు గుప్పించారు. ఎంఆర్ కాలేజీపై అశోక్ గజపతిరాజు చేస్తుంది తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ఎంఆర్ కాలేజీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేట్‌ కాలేజ్ అని, కళాశాల ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారంటూ పేర్కొన్నారు. ఆ విధానంతోనే ఇప్పుడు తామూ ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.



మాన్సాస్ కాలేజీలకు రూ. 6.5 కోట్ల నష్టం : – 
మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తప్పుడు వివరాలు ఇవ్వడం వల్ల ఆనాడు మాన్సాస్ కాలేజీలకు 6.5 కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్ గజతిరాజు ఈ డబ్బు ఇచ్చారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. 2018 -20 విద్యా సంవత్సరాల్లో 170 మంది విద్యార్ధులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లిబాటు కాకుండా పోయాయని తప్పుబట్టారు. అశోక్ గజపతిరాజు విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారంటూ ట్విటర్ వేదికగా సంచైత ఘాటుగా స్పందించారు.



ఎంఆర్ BED కళాశాల ప్రైవేటు: – 
సంచైత ట్విటర్ వేదికగా స్పందించిన దానిని బట్టి, గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్నప్పుడే ఈ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో అశోక్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కోటలో గల ఎంఆర్ BED కళాశాలను ప్రైవేటీకరించారు. దీని వల్ల అధిక ఫీజుల భారంతో ఆ కళాశాలలో రాను రాను ప్రవేశాలు తగ్గిపోయి, ఇప్పుడు మూసివేతకు గురైంది. దాని తర్వాత ఆర్థిక వనరుల కొరత కారణాన్ని చూపి, కోటలో గల ఉమెన్స్ కళాశాలను కో-ఎడ్యుకేషన్ కాలేజీగా మార్చేశారు.



అడ్డగోలుగా ఫీజుల పెంపు : –
అలాగే, మహారాజ పిజి కళాశాలలో కొన్ని కోర్సులను ఎత్తివేశారు. ఎంఆర్ కళాశాలలో అడ్డుగోలుగా ఫీజులు పెంచేశారు. అనుమతులు లేకపోయినా, అన్ ఎయిడెడ్ సెక్షన్ పెట్టి, విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో మాన్సాస్ విద్యా సంస్థల్లో కార్పొరేట్ తరహాలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.



మాన్సాస్ ఆస్తులు దోచేస్తున్నారు :-
అలాగే, టీడీపీ ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని మాన్సాస్ ఆస్తులు దోచేస్తున్నారంటూ, విద్యా సంస్థల నిర్వహణలో అడ్డగోలు విధానాలు అవలంభిస్తున్నారంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా, వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మాన్సాస్ లెక్కలు తేలుస్తామంటూ మంత్రి బొత్స సైతం హెచ్చరించారు. అశోక్ గజపతిరాజు ఛైర్మన్‌గా మాన్సాస్‌లో సంస్కరణల ముసుగులో ప్రజావ్యతిరేక విధానాలను తీసుకువచ్చారన్న ఆరోపణలున్నాయి.



విద్యాసంస్థల ప్రైవేటీకరణ :-
తాజాగా సంచైత గజపతిరాజు మరో అడుగు ముందుకేసి, ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలను ప్రైవేటీకరణకు పావులు కదుపుతుండటంతో..బాబాయ్‌కి, అమ్మాయ్‌కి పెద్దగా తేడా లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజవంశీయుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ, ట్రస్టును తమ జాగీరుగా మార్చుకుంటూ, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాన్సాస్ ట్రస్టుకు ఆ ప్రాంత ప్రజలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకుంది. ఏది ఏమైనా…ట్రస్టుకు సంబంధించి ఎప్పుడు…ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుతున్నారు.