Mansas Trust : కోట చుట్టూ మాన్సాస్ ట్రస్టు వివాదం

మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్తున్న ట్రస్టు వ్యవహారం కొత్త పుంతలు తొక్కింది.

Mansas Trust : కోట చుట్టూ మాన్సాస్ ట్రస్టు వివాదం

Mansas Trust Dispute

Mansas Trust : మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్తున్న ట్రస్టు వ్యవహారం కొత్త పుంతలు తొక్కింది.

మాన్సాస్‌ ట్రస్ట్‌… ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌. ఉత్తరాంధ్రకే పరిమితమైన ఈ ట్రస్ట్‌ ఏడాది కాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఇప్పుడు మరోసారి రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సుమారు అరవై ఏళ్లకు పైగా ఉన్న ఈ ట్రస్ట్ చరిత్రను… ప్రభుత్వం ఒకే ఒక్క జీవోతో తిరగరాసి, రాజకీయ సంచలనానికి తెరతీయగా, తాజా హైకోర్టు ఉత్తర్వులు… ప్రభుత్వం, గజపతి రాజుల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది. ఇప్పుడు ఈ ట్రస్టు భూముల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెరలేపింది.

మహరాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్… అంటే, మాన్సాస్… ఇప్పుడు ఈ ట్రస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర మాజీ మంత్రి, ట్రస్టు పూర్వాధ్యక్షుడు పూసపాటి అశోక్ గజపతిరాజును పదవి నుంచి దించేయడం… ఎప్పుడో ఆ కుటుంబం నుంచి విడిపోయిన ఉమా గజపతి కుమార్తె సంచైతకు ఆ పదవి కట్టబెట్టడం… సుమారు ఏడాదిన్నర కాలం పాటు జరిగిన ఈ చర్చకు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు… పెను సంచలనానికి దారితీసింది.

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా సంచైత నియామకం చెల్లదంటూ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రాజకీయ చర్చకు తెరలేచింది. ఈ వివాదంపై రాష్ట్ర మంత్రులు, అశోక్ గజపతిరాజు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని అశోక్ గజపతిరాజు అంటే… బోలెడంత అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వ నేతలు ఎదురు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రస్టు భూములు, ఆస్తుల వ్యవహారంలో ఏడాదిన్నర కాలంలో సంచైత హాయాంలో ఏం జరిగిందో అని అశోక్‌ గజపతిరాజు వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

విజయనగరం మహారాజుల మాన్సాస్ ట్రస్టు పరిధిలో సుమారు 14వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోనే కాకుండా, గోదావరి జిల్లాల్లోనూ ట్రస్టు భూములు వ్యాపించి ఉన్నాయి. మాన్సాస్ ట్రస్టు కింద చారిత్రక ఎం.ఆర్. కళాశాల, పీజీ కళాశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల వంటి విద్యా సంస్థలే కాకుండా…105 దేవాలయాలు కూడా ఉన్నాయి. సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి, రామతీర్థం దేవస్థానం, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు, పద్మనాభంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం, శ్రీకూర్మం దేవస్థానం వంటి ప్రఖ్యాత దేవస్థానాలున్నాయి. విద్యా సంస్థల నిర్వహణ, దేవాలయాల్లో నిత్య దూప, దీప, నైవైద్యాల కోసం అప్పట్లో కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు వేలాది ఎకరాల భూములను ట్రస్టుకు అప్పటి సంస్థానాదీశుడు పి.వి.జి.రాజు రాసిచ్చేశారు.

మాన్సాస్ ట్రస్టు మొదటి ఛైర్మన్ పి.వి.జి.రాజు. 1995లో ఆయన మరణాంతరం… పెద్దకుమారుడైన మాజీ ఎంపీ ఆనంద్ గజపతిరాజు ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 16 ఏళ్ల పాటు ట్రస్టు బాధ్యతలను ఆనంద గజపతిరాజు నిర్వహించారు. 2015లో ఆనంద గజపతి మరణాంతరం… ఆయన సోదరుడైన అశోక్ గజపతిరాజు ట్రస్టు బాధ్యతలను స్వీకరించారు. గతేడాది మార్చి వరకు ఛైర్మన్‌గా అశోక్ కొనసాగారు. అయితే, … రాత్రికి రాత్రి ఇచ్చిన జీవోతో… ఆయన్ని తప్పించి, ఆయన అన్న కుమార్తె సంచైత గజపతిని ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీనిపై న్యాయం పోరాటం చేసిన అశోక్ గజపతిరాజు…. చివరికి విజయం సాధించారు. సంచైత ఛైర్మన్ గా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం మరో సంచలనానికి దారితీసింది.

ఇప్పుడు మరోసారి మాన్సాస్ ట్రస్టు వ్యవహారం, భూముల అంశంపై ఇటు ప్రభుత్వానికి, అటు అశోక్ గజపతిరాజు మధ్య మాటల యుద్దం మొదలైంది. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు పదవీకాలంలో ట్రస్టులో పలు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ప్రభుత్వ మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ట్రస్టు కార్యకలాపాలకు సంబంధించి సుమారు పదేళ్లు పాటు అసలు ఆడిటింగే జరగలేదని, లీజుకిచ్చిన భూములను అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో చూపించలేదంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా, 2016లో ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు, దాదాపు 118 కోట్ల విలువైన సుమారు 115 ఎకరాల ట్రస్టు భూములను అమ్ముకున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, విజయనగరం-విశాఖ రహదారిలో ఉన్న లెప్రసీ ఇనిస్టిట్యూట్ కు సంబంధించిన 100 ఎకరాల భూమి ప్రభుత్వానికి దఖలు పడినా… ఆశోక్‌ గజపతిరాజు క్లయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాన్సాస్ ట్రస్టుపై దృష్టి సారించింది. ట్రస్టు వ్యవహారాలను ఆరా తీయాలని, అవినీతి, అక్రమాలపై నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

ప్రభుత్వం చేసిన ఆరోపణలను అశోక్ గజపతిరాజు తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. ట్రస్టు కార్యకలాపాలు, భూముల అమ్మకాల్లో అవినీతి, అక్రమాలు జరిగి ఉంటే నిగ్గుతేల్చాలంటూ పలుమార్లు ఆయన డిమాండ్‌ చేశారు. కేవలం తనని రాజకీయంగా దెబ్బతీసేందుకు, వ్యక్తిగత కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వంశపారంపర్యంగా, నిబంధనల ప్రకారం ట్రస్టును నిర్వహిస్తున్న తనని తప్పించి, తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడాన్ని ఖండించారు.

మొత్తం మీద… సంచైత నియామకం ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన తర్వాత….. మరోసారి మాన్సాస్ సంస్థ, భూముల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతుండటం ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ అశోక్ గజపతిరాజు ట్రస్టు బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయా… అందుకు ప్రభుత్వం సహకరిస్తుందా… ట్రస్టు కార్యకలాపాలపై ఎటువంటి విచారణ చేపడుతుందో వేచి చూడాలి.