కరోనా కష్టాల్లో ఈవెంట్ మేనేజర్లు.. ఈ ఏడాది ముహుర్తాలు ఇవే

  • Published By: vamsi ,Published On : May 24, 2020 / 02:27 AM IST
కరోనా కష్టాల్లో ఈవెంట్ మేనేజర్లు.. ఈ ఏడాది ముహుర్తాలు ఇవే

కరోనా దెబ్బకు ప్రపంచమే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. రోజువారీ తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. వివాహాది శుభకార్యాలకు అనుసంధానంగా ఉండే రంగాలు అయితే పూర్తిగా నష్టాల్లో పడిపోయాయి. ఈవెంట్ మేనేజర్లు పరిస్థితి దారుణంగా తయారైంది. రానున్న ఆరు నెలల కాలంలో కూడా కరోనా ప్రభావంతో ఎక్కడా కూడా పెళ్లిళ్లు, ఇంకేదైనా కార్యక్రమాలు ఘనంగా జరిగే పరిస్థితి కూడా లేదు.

ఇటువంటి పరిస్థితిలో కల్యాణ మండపాలు, డీజేలు, బ్యాండ్‌ బాజా, సన్నాయి మేళం, క్యాటరింగ్‌, వంటలు వండే వారు, మేకప్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, టెంట్‌హౌస్‌, పెళ్లి బట్టలు, టైలర్లు, ఫొటోలు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు, బంగారం, బట్టలు, పూలు, పెళ్లిపందిరి, కూరగాయలు అమ్మేవారు, వాహనాలు కిరాయికి ఇచ్చేవారు, కుమ్మరి, చాకలి, నాయిబ్రాహ్మణులు ఇలా అనేకమందికి పని దొరకని పరిస్థితి.

వివాహాలు చేసుకునేవారు కూడా హంగూ, ఆర్భాటాలు లేకుండా ఇళ్లకే పరిమితమై పెళ్లితంతు కానిచ్చేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం కలెక్టర్‌, తాసిల్దార్ల అనుమతి తప్పనిసరి తీసుకుని హంగూ, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వివాహాలు చేసుకుంటున్నారు. తక్కువ మంది బంధువులతో పాటు నిబంధనల మేరకు వివాహాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఈ ఏడాది ముహూర్తాలు.. మూఢాలు:
మే నెలలో ఇప్పటికే కొన్ని ముహూర్తాలు ముగిసిపోయాయి. 29వ తేదీ మాత్రమే ఓ ముహూర్తం ఉంది. అయితే ఆ రోజు కూడా అతి తక్కువశాతం వివాహాలు జరుగుతున్నాయి. మే 30వ తేదీ నుంచి జూన్‌ 9 వరకు పది రోజుల పాటు మూఢం కారణంగా శుభకార్యాలు జరిగే అవకాశం లేదు. 

జూన్‌ 10, 11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌ 22 నుంచి జూలై 20 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాసం.. శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. జూలై 23, 24, 25వ తేదీలతో పాటు ఆగస్టు 2, 7, 8, 14వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 16వ తేదీ వరకు నెల రోజులు అధిక అశ్వీయుజ మాసం, శూన్యమాసం కావడంతో మంచి ముహూర్తాలు లేవు. అక్టోబర్‌ 21, 28, 29, 30, నవంబర్‌ 6, 11 నుంచి డిసెంబర్‌ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్‌, జనవరిలో సంక్రాంతి కారణంగా ముహూర్తాలు ఉన్నా కొందరు శుభకార్యాలు చేసుకోవడానికి ఆసక్తి చూపరు.