విశాఖ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం..డ్యూటీలో ఉన్నది నలుగురే

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 06:29 AM IST
విశాఖ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం..డ్యూటీలో ఉన్నది నలుగురే

విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో నలుగురు మాత్రమే డ్యూటీ చేస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు.

వీరిలో మల్లేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారని, ఇతడిని రాత్రి 12 గంటల సమయంలో గాజువాకలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇక మిగిలిన ముగ్గురుకు స్వల్ప గాయలు మాత్రమే అయ్యాయని తెలిపారు. ఇక్కడ ఉన్న ఈ సంస్థ రసాయనాల్ని శుద్ధి చేసి పలు ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. భారీ ఎత్తున రసాయనాల నిల్వ ఉండడమే ప్రమాద తీవ్రతకు కారణమని పలువురు భావిస్తున్నారు.

అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉండడం..భారీ ఎత్తున శబ్దాలు రావడంతో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కంపెనీలో ఉన్న కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. బయటకు పరుగులు తీశారు. శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల వరకు వినిపించాయని, మంటలు 30 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.

ప్రమాదం విషయం తెలుసుకున్న పలు ఫార్మా సంస్థల్లో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో పరుగులు తీశారు. నల్లటి పొగలు దట్టంగా అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుండడంతో…పలువురు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.