Milk Adulteration : దారుణం.. యూరియా, ఆయిల్, నీళ్లు కలిపి పాల తయారీ.. తాగితే అంతే..

పాలు ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. పాలు తాగితే బలం వస్తుందని చెబుతారు. కానీ, ఆ పాలు తాగితే బలం సంగతి ఏమో కానీ రోగం రావడం ఖాయం. ఏకంగా కేన్సర్ రావొచ్చు.. ఏంటి.. షాక్ అయ్యారా?

Milk Adulteration : దారుణం.. యూరియా, ఆయిల్, నీళ్లు కలిపి పాల తయారీ.. తాగితే అంతే..

Milk Adulteration

Milk Adulteration : స్వచ్చమైన పాలు దొరకడం అన్నది ఈ రోజుల్లో గగనమైంది. అయితే మనకు ఇప్పటివరకు పాల వ్యాపారులు చేసే మోసం.. అంటే పాలల్లో నీళ్లు కలపడం మాత్రమే తెలుసు. లేదంటే పాల పొడితో పాలు తయారు చేసి మామూలు పాలతో కలిపి వాటిని విక్రయించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి ఏమంత లాభదాయకం కాదని అనుకున్నారో ఏమో మరింత అక్రమాలకు తెరతీశారు కొందరు అక్రమార్కులు.

కల్తీ పాల తయారీ మొదలుపెట్టారు. ఇందుకోసం వారు ఉపయోగించే పదార్ధాలు చూస్తే ప్రజల ఆరోగ్యాలతో కల్తీ వ్యాపారులు ఎలా చెలగాటడం ఆడుతున్నారో మనకు అర్థమవుతుంది. యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్, నీళ్లు, పాలు కలిపి పాలు తయారీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చిన్నగోరంట్లపాలెంలో ఈ ఘటన జరిగింది.

సంజీవరెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లోనే కల్తీ పాల తయారీ కేంద్రం తెరిచాడు. సగం పాలు తీసేస్తాడు. నీళ్లు, యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్ కలుపుతాడు. ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తాడు. చిక్కటి పాలు తయారు చేస్తాడు. ఇలా తయారు చేసిన కల్తీ పాలను అతగాడు ఏకంగా చిత్తూరు జిల్లాలోని డైరీలకు సరఫరా చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పాల చిక్కదనం బాగా పెరుగుతుంది. డైరీలో అలాంటి పాలకు మంచి రేటు వస్తుంది. అయితే ఇవి తాగిన వారికి సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి కేన్సర్ వరకు తీవ్ర స్థాయిలో ఆరోగ్య ముప్పు తప్పదు.

కల్తీ పాల తయారీ గురించి తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. పాల తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న నిందితుడు సంజీవరెడ్డిపై కేసు నమోదు చేశారు. కల్తీపాలు, సామాగ్రి, మిక్సర్లు స్వాధీనం చేసుకున్నారు.