Alla Nani : లక్షల సంఖ్యలో చనిపోవాలని కోరుకుంటున్నారా? చంద్రబాబు దీక్షపై మంత్రి విమర్శలు

కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షపై మంత్రి ఆళ్ల నాని తీవ్ర విమర్శలు చేశారు.

Alla Nani : లక్షల సంఖ్యలో చనిపోవాలని కోరుకుంటున్నారా? చంద్రబాబు దీక్షపై మంత్రి విమర్శలు

Alla Nani

Alla Nani Criticize Chandrababu Deeksha : కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షపై మంత్రి ఆళ్ల నాని తీవ్ర విమర్శలు చేశారు. మూడు గంటల పాటు చంద్రబాబు చేసిన దీక్షను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ అధోగతి పాలైందని విమర్శించారు. కరోనాతో రాష్ట్రం అల్లాడుతున్న సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు జూమ్ మీటింగులు పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.

ఈరోజు దీక్షకు దిగే ముందు చంద్రబాబు సుష్టుగా తిని, తిన్నది అరిగేంత వరకు దీక్షను చేపట్టారని ఎద్దేవా చేశారు. దీక్ష ముగియగానే ఇంటికి వెళ్లి, తిని, పడుకోవడమేనా చంద్రబాబు పని అని ప్రశ్నించారు. ఈరోజు దీక్షతో చంద్రబాబు సాధించింది ఏమిటని మంత్రి నిలదీశారు.

కరోనా వల్ల కేవలం 12,700 మంది మాత్రమే చనిపోయారనే బాధ చంద్రబాబుకు ఉందా? అని నాని ప్రశ్నించారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లోనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉందనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. తనను ఓడించిన ప్రజలు లక్షల సంఖ్యలో చనిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారా? అని అడిగారు. చంద్రబాబు కుట్రలను ప్రజలందరూ గమనించాలని అన్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

సాధన దీక్ష పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనకు చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో సాధన దీక్ష చేపట్టారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు దీక్షలో పాల్గొన్నారు. కొవిడ్ తో మరణించిన ప్రతి కుటుంబానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, ఆక్సిజన్ మరణాలన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి అలా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అకాల వర్షాలతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, కరోనా కారణంగా మరింత దెబ్బతిన్న రైతన్నలను ఆదుకోవడం కోసం వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేసింది.