Lok Sabha : జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్‌డ్రా చేసింది-నిర్మలా సీతారామన్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ నుంచి ప్రభుత్వం నిధులు విత్‌డ్రా చేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో చెప్పారు.

Lok Sabha : జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్‌డ్రా చేసింది-నిర్మలా సీతారామన్

Lok Sabha :  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ నుంచి ప్రభుత్వం నిధులు విత్‌డ్రా చేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలియజేయకుండా, వారి అనుమతి లేకుండా ఉద్యోగుల జీపీఏఫ్ ఖాతాల నుంచి 2021, 2022 సంవత్సరాల్లో…. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ సమ్మతితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిపిఏఫ్ సొమ్మును విత్ డ్రా చేసిందా ? అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమాధానం చెప్పారు. 2021, 2022 ఆర్ధిక సంవత్సరాల్లో…. 68,020 మంది ఉద్యోగుల జిపిఏఫ్ ఖాతాలలో అంతకు మునుపు జమ చేసిన డిఎ మొత్తం నుంచి రూ. 413.73 కోట్లు డిఎ బకాయిలు విత్ డ్రా చేసినట్లు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

స్ఫూర్తి పథకం కింద ఏపీలో 16 క్లస్టర్లు
సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (స్ఫూర్తి) కింద ఆంధ్రప్రదేశ్‌లో 16 క్లస్టర్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తు ఆమోదం తెలిపిన 16 క్లస్టర్లకుగాను ఇప్పటికే 6 క్లస్టర్లు పని ప్రారంభించాయని చెప్పారు. చిత్తూరు జిల్లాలోని కలంకారీ క్లస్టర్‌, తూర్పు గోదావరి జిల్లాలో ఆగ్రో ఇండస్ట్రీ, హార్టికల్చర్‌, ఫ్లోరీకల్చర్‌ ఉత్పాదనలు ప్రాసెస్‌ చేసే క్లస్టర్‌, గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు నగల క్లస్టర్‌, విశాఖపట్నం జిల్లాలో కాఫీ క్లస్టర్‌, విజయనగరం జిల్లాలో కాయర్‌ (కొబ్బరి పీచు) ఉత్పాదనల క్లస్టర్‌, బంగారు నగల క్లస్టర్‌ పని చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 10 క్లస్టర్లలో పనులు కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధికం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పని ప్రారంభిస్తాయని మంత్రి తెలిపారు.

కుకునూరు ఉక్కు గనులపై సర్వే
ఆంధ్రప్రదేశ్‌లోని కుకునూరు గనుల్లో ఇనుప ఖనిజం అన్వేషణ, వెలికితీతకు సంబంధించి రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ స్టీల్‌ ప్లాంట్‌) ఆంధ్రప్రదేశ్‌ ఖనాజాభివృద్ధి సంస్థతో 2017లో ఒప్పందం చేసుకుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే తెలిపారు. ఈ ఒప్పందానికి అనుగుణంగానే కుకునూరు బ్లాక్‌లో నాణ్యమైన ఇనుప ఖనిజం లభిస్తుందో లేదో తెలుసుకునేందుకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సర్వే చేయిస్తున్నదని తెలిపారు.