రాజకీయాల నుంచి తప్పుకుంటా, మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపింది. బయటి నుంచి వేల మందిని తిరుపతికి తరలించి వైసీపీ... దొంగ ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా, మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddi Reddy Sensational Comments

Peddi Reddy : తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపింది. బయటి నుంచి వేల మందిని తిరుపతికి తరలించి వైసీపీ… దొంగ ఓట్లు వేయించిందని టీడీపీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు.

దొంగ ఓటర్లను పురమాయించి వైసీపీ దొంగ ఓట్లు వేయించిందని టీడీపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ అనుకూల మీడియా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. ఓటర్లను మీడియా ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

‘‘నారా లోకేశ్‌ నన్ను వీరప్పన్‌గా ట్వీట్‌ చేశారు. రాజకీయ లబ్ధికోసం ఏదంటే అది మాట్లాడితే ఉపేక్షించం. కిరణ్‌ కుమార్‌రెడ్డితో కలిసి టీడీపీ వాళ్లే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేశారు. నన్ను స్మగ్లర్‌గా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. టీడీపీ తీరు చాలా అభ్యంతరకరం. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఎదుర్కోలేక ప్రణాళిక ప్రకారం దారుణాలు చేస్తున్నారు. టీడీపీకే ప్రజాబలం ఉందా? వైసీపీకి ప్రజా బలం లేదా? ఫలితాల రోజు తెలుస్తుంది.. ఎవరికి ప్రజా బలం ఉందో. తిరుపతి యాత్రా స్థలం కావడంతో ప్రైవేటు బస్సులు వస్తాయి. ఆ బస్సులు వైసీపీగా చిత్రీకరించడం దారుణం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుని మసలుకుంటే ఎన్నికల్లో కొనసాగుతారు. లేదంటే ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ వేలమందిని తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్‌ సైతం ఆరోపించారు. సీఎం జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలోకి బయటి వ్యక్తులు చొరబడ్డారని తెలియజేస్తూ ఫొటో ఆధారాలను జత చేసి సీఈవోకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రెండు బస్సుల్లో వైసీపీ నేతలు బయటి వ్యక్తుల్ని తరలించాలని లేఖలో తెలిపారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం(ఏప్రిల్ 17,2021) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ రాత్రి ఏడు గంటల వరకు సాగింది. తిరుపతి లోక్‌సభ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి నియోజకవర్గంలో 45.84 శాతం, సర్వేపల్లి నియోజకవర్గంలో 57.91 శాతం, గూడూరు నియోజకవర్గంలో 51.82 శాతం, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 60.11 శాతం, వెంకటగిరి నియోజకవర్గంలో 55.88 శాతం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 57 శాతం, సత్యవేడు నియోజకవర్గంలో 58.4 శాతం పోలింగ్‌ నమోదైంది.