బాలయ్య అల్లుళ్ల మధ్య ఫిటింగ్ పెట్టిన సీఎం!

  • Published By: sreehari ,Published On : December 26, 2019 / 11:54 AM IST
బాలయ్య అల్లుళ్ల మధ్య ఫిటింగ్ పెట్టిన సీఎం!

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ల మధ్య చిచ్చు మొదలైందంటున్నారు. ఈ చిచ్చు రేపింది ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ అనేది టాక్‌. అసలు వీరిమధ్య చిచ్చు రేపాల్సిన అవసరం జగన్‌కు ఏమొచ్చిందనే కదా మీ డౌట్‌.. ఔను.. ఆయన బాలయ్య బాబు ఇద్దరు అల్లుళ్లైన నారా లోకేశ్‌, భరత్‌ మధ్య ఫిటింగ్‌ బాగానే పెట్టారు. అదేంటంటే.. రాష్ట్రంలో మూడు రాజధానులంటూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా జగన్‌ ప్రకటించారు. జీఎన్‌ రావు కమిటీ కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఈ విషయమే లోకేశ్‌, భరత్‌ల మధ్య రాజకీయ తగవుకు కారణమైందంట.

చిన్న అల్లుడి మద్దతు :
బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేశ్ ఒక పక్క రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అంటున్నారు. మరోపక్క బాలయ్య చిన్న అల్లుడు విశాఖకు చెందిన గీతం విద్యాసంస్థల అధిపతి భరత్ మాత్రం విశాఖ రాజధాని అయితేనే మంచిదని జగన్‌ నిర్ణయానికి మద్దుతు పలుకుతున్నారు. విశేషం ఏంటంటే.. పెద్ద అల్లుడు లోకేశ్‌ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, చిన్న అల్లుడు భరత్‌ విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు. సీఎం జగన్ తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయంతో కొత్త చిక్కు వచ్చిపడందట. సీఎం నిర్ణయాన్ని పెద్దల్లుడు నారా లోకేశ్ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కూడా వ్యతిరేకిస్తుందుకోండి.

నారా లోకేశ్‌ మంగళగిరిలో విశాఖకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ కాగడాల ప్రదర్శన కూడా చేశారు. చంద్రబాబు కూడా ఆయా వర్గాల వారిని సమీకరించి అమరావతికి మద్దతుగా మాట్లాడిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య చిన్నల్లుడు మాత్రం విశాఖకు రాజధాని తరలింపు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఒక వైపు చంద్రబాబు అమరావతి రాజధాని యథావిథిగా ఉండాలంటూ ఆందోళనలకు మద్దతు ఇస్తుంటే.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు విశాఖపట్నం కార్యనిర్వాహఖ రాజధానికి మద్దతిస్తూ తీర్మానం చేశారు. జగన్ నిర్ణయాన్ని విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు సమావేశం జరిపి విశాఖలో రాజధానికి స్వాగతం తెలిపారు.

ఇదే లోకేశ్‌కు నచ్చలేదట :
విశాఖలో జరిగిన సమావేశంలో భరత్‌ కూడా పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా భరత్‌ టీడీపీ అధినేత కుటుంబ సభ్యుడు. ఆయనే ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం ఇబ్బందిగా మారింది. ఇది నారా లోకేశ్‌కు నచ్చడం లేదంటున్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారంటూ కుటుంబ సభ్యుల డిస్కషన్స్‌లో అంటున్నారట. ఇలా చేయడం వల్ల ప్రత్యర్థుల ముందు చులకన అయిపోతామని చెబుతున్నారట. ఈ విషయంలో బాలయ్య ఏదో ఒక నిర్ణయం తీసుకొని, భరత్‌ను కూడా పార్టీ తరపున మాట్లాడేలా చేయాలంటున్నారని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

మరోపక్క, ఏ ప్రాంతానికి చెందిన నాయకులు ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని… దీనిని అంత సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుకు ఎప్పుడేం చేయాలో తెలుసునని, దీని గురించి వర్రీ కానక్కర్లేదని చెప్తున్నాయి. కానీ, ప్రత్యర్థి వర్గాలు మాత్రం ఒక కుటుంబంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాష్ట్రమంతటా టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అన్న కామెంట్లు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే పార్టీ పరంగా అందరితోనూ ఒకే విధంగా మాట్లాడించలేని సంకట స్థితిలో చంద్రబాబు ఉన్నారని అనుకుంటున్నారు.