ప్యాకేజీ కోసమే జనసేన పెట్టారు : జగన్ ను ఎదుర్కోలేక ఒక్కటవుతున్నారు

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 02:28 PM IST
ప్యాకేజీ కోసమే జనసేన పెట్టారు : జగన్ ను ఎదుర్కోలేక ఒక్కటవుతున్నారు

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ-జనసేన పొత్తుపై అధికార వైసీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. జనసేనాని పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పచ్చి అవకావవాది అని ఒకరంటే, మోసకారి అని మరొకరు అన్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా బీజేపీతో జనసేన పొత్తుపై ఘాటుగా స్పందించారు.

 

ప్రత్యేక హోదా పోరాటం ఎందుకు ఆపారు..?
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రోజా.. ప్యాకేజీల కళ్యాణ్.. పొత్తుల కళ్యాణ్ గా మారారని విమర్శించారు. పొత్తులు, ప్యాకేజీల కోసమే పవన్ పార్టీ పెట్టినట్టు ఉన్నారని రోజా అన్నారు. నాడు పాచిపోయిన లడ్డూలు.. ఇప్పుడు తాజాగా మారాయా? అని పవన్ ను నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం ఎందుకు ఆపారో పవన్ ప్రజలకు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. సినిమాలో క్యారెక్టర్లు మార్చినట్లు పవన్ పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. పవన్ లాంటి వాళ్లు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరన్నారు రోజా.

rojaa

బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన వారిని ఎలా చేర్చుకున్నారు..?
బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సీఎం రమేష్, సుజనా చౌదరితో పాటు పవన్ ను ఎందుకు బీజేపీలోకి తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు రోజా. సీఎం జగన్ ను ఎలా ఎదుర్కొవాలో తెలియక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని కామెంట్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని చెప్పారు. 2024లో బీజేపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిశామని పవన్ చెబుతుంటే.. పవన్ ది అవకాశవాద రాజకీయం అని వైసీపీ ఎదురుదాడికి దిగింది.

perni

బీజేపీతో పవన్ పొత్తు : చంద్రబాబు గేమ్ ప్లాన్
బీజేపీ-జనసేన పొత్తు చంద్రబాబు గేమ్ ప్లాన్ అని మంత్రి పేర్నినాని ఆరోపించారు. చంద్రబాబు ఏం చెబితే.. ప్రజాశాంతి, కాంగ్రెస్, ఓఎల్ఎక్స్(జనసేన) పార్టీలు అవి చేస్తాయని మంత్రి అన్నారు. వైసీపీకి ప్రజలతోనే పొత్తు ఉంటుందని, మాకు ప్రజలే కావాలని మంత్రి స్పష్టం చేశారు. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం పవన్ పై విమర్శలు చేశారు. ఎన్నికలు ముగిసి 6 నెలలు కాకుండానే.. పార్టీని నడపలేక పవన్ చేతులెత్తేశారని అన్నారు. వామపక్ష భావజాలం పేరుతో జనసేన పెట్టిన పవన్.. అందుకు భిన్నంగా వేరే వారితో చేతులు కలిపారని మండిపడ్డారు. ఉన్న ఒక్క సీటును కూడా నిలుపుకోలేని పవన్ ను జనం నమ్మరని చెప్పారు. ఎన్నికలకు ముందే టీడీపీకి పవన్ దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు. పవన్ గుంపుగా వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరని మంత్రి అనిల్ అన్నారు.

ambati

మోడీ ఫ్రెష్ లడ్డూ ఇచ్చారా..?
ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూ అని ప్రధాని మోడీపై ధ్వజమెత్తిన పవన్ కు.. ఇవాళ జీడిపప్పు, కిస్ మిస్ తో మోడీ ఫ్రెష్ లడ్టూలు పంపారా అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే పవన్.. హోదా అడక్కుండా బీజేపీతో బేషరతుగా ఎందుకు కలసి పనిచేస్తానని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. గతంలో ఎన్నో కూటములు పెట్టారు… అయినా వైసీపీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. చంద్రబాబు సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా మీకు జగనే టార్గెట్ అన్నారు. సుజనా, సీఎం రమేష్ లాంటి వాళ్ళని చంద్రబాబు బీజేపీలోకి పంపారు.. ఇప్పుడు మీరు బీజేపీతో కలిశారు.. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Also Read : జగన్ పై నిందలు వేస్తే ఊరుకోను : పవన్ కు కేఏ పాల్ వార్నింగ్