మంత్రి పెద్దిరెడ్డితో రోజా వివాదం!

  • Published By: sreehari ,Published On : February 4, 2020 / 03:40 PM IST
మంత్రి పెద్దిరెడ్డితో రోజా వివాదం!

ఎమ్మెల్యే రోజా… ద ఫైర్ బ్రాండ్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అనే టైపు ఆమెది. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె.. పొలిటికల్ ఎంట్రీ తర్వాత తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, టీడీపీ నుంచి ఆమెకు అడుగడుగునా ఆటంకాలెదురయ్యాయి.

గత ఏడాది ఎన్నికల్లో రెండోసారి విజయం దక్కడం, పార్టీ అధికారంలోకి రావడంతో ఇక అంతా మంచి రోజులే అని రోజా భావించారు. కానీ, ఇప్పుడు ఆమెకు నియోజకవర్గంలో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. అందులోనూ సొంత పార్టీ నేతల నుంచి ఈ అనుభవం ఎదురవుతోంది. 

సొంత పార్టీకి చెందిన జిల్లాకు చెందిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఆయన తనను ఓడించాలని ప్రయత్నించినట్లు కూడా ఆమె వాపోతున్నారు. తన సొంత నియోజకవర్గం నగిరిలో పెద్దిరెడ్డి తన వర్గాన్ని తయారు చేసుకుంటూ, తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఎమ్మెల్యే రోజా. సొంత నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. గ్రామంలో అడుగు పెట్టనివ్వకుండా స్థానిక వైసీపీ నేతలు ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఈ ఘటనను రోజా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. 

ఆవేశం వద్దు.. నేను చూసుకుంటా :
అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం కోసం చిత్తూరుకు వచ్చిన సీఎం జగన్ వద్ద ఈ వ్యవహారాన్ని రోజా ప్రస్తావించారట. తనను సొంత పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తున్నారని జగన్ వద్దే వాపోయారట రోజా.

ఆవేశం వద్దు…. నేను చూసుకుంటా అంటూ సీఎం జగన్ సముదాయించారని అంటున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తన నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని, వారంతా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నది రోజా ఆందోళన. ఈ నేపథ్యంలో రోజా విడుదల చేసిన ఆడియో టేపులు నగరిలోనే కాదు, జిల్లా అంతటా కలకలం రేపుతోంది. 

రోజాకు ఎందుకీ కష్టం :
తన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని, తన వ్యతిరేకులతో, తనను వెన్నుపోటు పొడిచిన వారితో కలిసి కార్యక్రమాలకు హాజరైతే పార్టీకి దూరం అవుతారని రోజా ఆడియో టాక్‌లో చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు నగరిలో ఏం జరుగుతోందన్న చర్చ జిల్లా అంతటా మొదలైంది. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజాకు ఎందుకీ కష్టం అన్న టాక్ వినిపిస్తోంది.

నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది. సీఎం వద్ద ప్రస్తావించినా తన సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన ఆమెను వెంటాడుతోందని కార్యకర్తలు అంటున్నారు. చివరకు ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.