JC Prabhakar Reddy : వరుసగా రెండో రోజూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ.. మనీలాండరింగ్ వ్యవహారంలో దర్యాఫ్తు

వాహనాల కొనుగోలు కుంభకోణంలో వరుసగా రెండో రోజూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఈడీ విచారిస్తోంది.

JC Prabhakar Reddy : వరుసగా రెండో రోజూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ.. మనీలాండరింగ్ వ్యవహారంలో దర్యాఫ్తు

JC Prabhakar Reddy : వాహనాల కొనుగోలు కుంభకోణంలో వరుసగా రెండో రోజూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారిస్తోంది. శనివారం ఉదయం నుంచి 7 గంటలుగా ఈడీ విచారిస్తోంది. శుక్రవారం సుమారు 9 గంటల పాటు విచారించిన ఈడీ.. శనివారం కూడా ఎంక్వైరీ కొనసాగిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంలో దర్యాఫ్తు చేస్తున్న ఈడీ.. బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తోంది.

హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించగా.. శనివారం కూడా పిలవడంతో ఉదయం 10.15 గంటలకు విచారణకు హాజరయ్యారు. బస్సుల కొనుగోలుకు సంబంధించి మనీలాండరింగ్ కు ఆయన పాల్పడ్డారనే అభియోగాలు వస్తున్నాయి. దీంతో మనీలాండరింగ్ చట్టం కింద ఆయనపై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని రెండు రోజులుగా ఈడీ విచారిస్తోంది. రెండో రోజు తనకి సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్స్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి విచారణకు వచ్చారు. ఆయన బ్యాక్ స్టేట్‌మెంట్స్‌ను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించి లావాదేవీలపై ప్రశ్నిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జేసీ ట్రావెల్స్ వాహనాల కొనుగోలులో అవకతవకలు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడటం లాంటి వాటిపై ఈడీ మరింత లోతుగా ప్రశ్నిస్తోందని సమాచారం. బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు ఎవరెవరు సహకరించారు? ఇందులో ఇంకా ఎవరి హస్తం ఉంది? అనే వివరాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు.

జేసీ ఫ్యామిలీ ఎప్పటినుంచో ప్రైవేట్ బస్సుల వ్యాపారంలో కొనసాగుతోంది. తండ్రి కాలం నుంచి జేసీ బ్రదర్స్ ప్రైవేట్ బస్సుల వ్యాపారంలో ఉన్నారు. గతంలో ఉత్తరాఖండ్ లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి స్క్రాప్ కింద వాహనాలను కొనుగోలు చేసి నాగలాండ్ లో బీఎస్-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. బీఎస్ 3 వాహనాలను ఫోర్జరీ పత్రాల ద్వారా బీఎస్ 4గా మార్చారనే అభియోగాలు ఉన్నాయి. వీటిపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఒక బస్సు రిజిస్ట్రేషన్ మీదనే పలు బస్సులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో రెండేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏపీ రవాణశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫోర్జరీ పత్రాలతో వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు పొందినట్లు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా జూన్ 17న అనంతపురం, హైదరాబాద్ లోని జేసీ సోదరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ఇటీవల ఆ కేసులో మరింత సమాచారం కోసం విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.