విశాఖ స్టీలు ప్లాంటు కోసం ఉద్యమం, ఉత్తరాంధ్ర అనుబంధం

విశాఖ స్టీలు ప్లాంటు కోసం ఉద్యమం, ఉత్తరాంధ్ర అనుబంధం

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని.. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. 2021, ఫిబ్రవరి 05వ తేదీ శుక్రవారం భారీ నిరసనలకు కార్మికులు ప్లాన్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ప్రాణాలు అర్పించి కర్మాగారాన్ని సాధించుకున్నామని.. ఆవిధంగానే ప్రాణాలు ఒడ్డయినా ప్లాంట్‌ను రక్షించుకుంటామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతుందని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నాయి. స్టీల్‌ప్లాంటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. స్టీల్‌ ప్లాంటు అనగానే మాతృ సంస్థగా, అందరికీ ఉపాధి కల్పించేదిగా అభిమానిస్తారు. అక్కడ తయారైన స్టీల్‌నే గృహ నిర్మాణానికి ఉపయోగించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.

స్టీల్‌ప్లాంట్‌లో శాశ్వత ఉద్యోగులు 17 వేల మంది వరకు ఉండగా, కాంట్ర్టాక్టు కార్మికులుగా మరో 20 వేల మంది వరకు పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఏర్పాటైన వందలాది చిన్నతరహా పరిశ్రమలపై మరో లక్ష మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. విశాఖలో అన్నిరకాల వ్యాపారాల్లోనూ స్టీల్‌ ప్లాంటు ఉద్యోగుల లావాదేవీలు 10 శాతం వరకు ఉంటాయి. నెలకు ఎలా లేదన్నా 200 కోట్లు స్టీల్‌ ప్లాంటు నుంచి విశాఖ మార్కెట్‌లోకి వస్తుంది. అలాంటి సంస్థను ప్రైవేటుపరం చేస్తే.. విశాఖలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయనే అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.