చంద్రబాబు ప్రచారంలో కనిపించని కేశినేని నాని..వ్యూహాత్మకమా? విభేదాలు సమసిపోలేదా?

చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాలు మాత్రం పాల్గొన్నారు.

చంద్రబాబు ప్రచారంలో కనిపించని కేశినేని నాని..వ్యూహాత్మకమా? విభేదాలు సమసిపోలేదా?

MP Keshineni Nani absent during the Chandrababu campaign : చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాలు మాత్రం పాల్గొన్నారు. దీంతో కేశినేని నాని ఎందుకు హాజరుకాలేదన్న చర్చ సాగుతోంది. నాని అటెండ్‌ కాకపోవడానికి కారణమేంటి? వ్యూహాత్మకమా.. లేక విభేదాలు ఇంకా సమసిపోలేదా…

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య నగరాల్లో ప్రచారం చేస్తున్నారు. మొన్న విశాఖలో పర్యటించిన చంద్రబాబు.. నిన్న విజయవాడలో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు ప్రచారంలో ఎంపీ కేశినేని నాని లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు పర్యటనకు ముందు పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, సీనియర్‌ నేత నాగుల్‌మీరా.. కేశినేని నానిపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు టూర్‌కు ఒక్కరోజు ముందు నేతల మధ్య రాజీ కుదిరింది. దీంతో వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఐక్యతారాగం ఆలపించారు. దీంతో వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడినట్టేనని అంతా భావించారు. అయితే చంద్రబాబు ప్రచారంలో కేశినేని నాని ఎక్కడా కనిపించకపోవడంతో వివాదం ఇంకా చల్లారలేదన్న చర్చ సాగుతోంది.

కేశినేని నాని ప్రచారంలో పాల్గొనకపోవడంపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. తాత్కాలికంగా వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడినా.. ఆ ముగ్గురు నేతలతో ప్రచారంలో పాల్గొనడానికి ఆయన సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ప్రచారంలో పాల్గొనలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన పర్యటనకు కేశినేని నాని దూరంగా ఉండాల్సిందిగా చంద్రబాబు సూచించినట్టుగా కూడా పార్టీ నేతల్లో ప్రచారం సాగుతోంది. మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రమోట్‌ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేశినేని నానిపై ఆరోపణలు చేసిన బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్‌ మీరా మాత్రం చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రచారంలో టీడీపీ లీడర్లు బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్‌కు చంద్రబాబు చురకలంటించారు. నాయకులు తన పక్కన ఉండటం వల్ల ఉపయోగం ఉండదని.. నాయకులు వెనక్కి వెళ్లి అభ్యర్థులను తన పక్కన నిలబెడితే.. నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయని సూచించారు. చంద్రబాబు పరోక్ష మాటలతో వెనుక నిలబడి.. అభ్యర్థులను ముందుకు పంపారు బుద్దా, జలీల్‌ఖాన్‌. ఏదేమైనా చంద్రబాబు ప్రచారానికి స్థానిక ఎంపీ కేశినేని హాజరుకాకపోవడంపై పార్టీతోపాట ప్రజల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.