ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర, రూట్ మ్యాప్

ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర, రూట్ మ్యాప్

MP Vijayasai Reddy : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ విడుదల చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీపీ ఈ ప్రదర్శనను తలపెట్టింది. 2021, ఫిబ్రవరి 20వ తేదీ శనివారం ఉదయం 8గంటల 30నిమిషాలకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అసీల్‌మెట్ట, సంగం జంక్షన్, కాళీ ఆలయం, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, నావల్ అర్మామెంట్ డిపో జంక్షన్, విమానాశ్రయం, షీలా నగర్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ , పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఆర్చి వరకు యాత్ర సాగనుంది.

ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయసాయి రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభలో ఆ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, విశాఖ జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొననున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని, అవసరమైతే ఢిల్లీకి కార్మిక సంఘాల ప్రతినిధులను తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి ఇదివరకే వెల్లడించారు. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరామని పేర్కొన్నారు.