Rachhabanda : రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు..!

సీఎం జగన్ చేపట్టాలనుకుంటున్న రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ కార్యక్రమం వచ్చే నెలలోనే మొదలవ్వబోతునట్లు సమాచారం.

Rachhabanda : రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు..!

Rachhabanda

CM Jagan Rachhabanda : ఇప్పటి వరకు పాలనలో బిజీగా గడిపిన సీఎం జగన్ ఇకపై ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్‌ అయ్యారు.. తండ్రి వైఎస్‌ఆర్ అడుగు జాడల్లో నడుస్తూ రచ్చబండ పేరుతో ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమయ్యారు.. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఇప్పటికే అధికారులు సమాయత్తమవుతున్నారు. చాలా కాలంగా సీఎం జగన్ చేపట్టాలనుకుంటున్న రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ కార్యక్రమం వచ్చే నెలలోనే మొదలవ్వబోతునట్లు సమాచారమందుతోంది.

అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచి నెలకి రెండు గ్రామ సచివాలయాలు సందర్శిస్తానని ఇప్పటికే సీఎం జగన్ చెప్పారు. దీనికి అనుగుణంగా సీఎం కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా లేదా కడప జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

సీఎం జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు కావొస్తుంది. దీంతో ఇప్పటివరకు అమలవుతున్న పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం పనితీరుపై తీసుకునే విధానాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలని నేరుగా ప్రజల నుంచి తెలుసుకోబోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న నూతన విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నవతరత్నాలు వంటి వాటిపై ప్రజలకు వివరించనున్నారు సీఎం. వీటితో పాటు ప్రజల సమస్యలపై దరఖాస్తులు కూడా తీసుకోనున్నారు.

ప్రజలతో మమేకమయ్యేందుకు సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినా వచ్చే నెల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ఈ కార్యక్రమంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.