తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులా ? 10 రోజులా ? 

  • Published By: madhu ,Published On : January 5, 2020 / 01:00 AM IST
తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులా ? 10 రోజులా ? 

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్నిరోజులు ఉండబోతుందన్న దానిపై టీటీడీ క్లారిటీ ఇవ్వబోతోంది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం వైకుంఠ ఏకాదిశి కావడంతో 2020, జనవరి 05వ తేదీ ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందుకోసం టీటీడీ పాలకమండలి సభ్యులు అత్యవసరంగా సమావేశం అవుతున్నారు. 
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయం ఉత్తర ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించే సంప్రదాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ దర్శనాలకు రెండురోజుల పాటు అనుమతిస్తున్నారు. అయితే… ఈ దర్శనాన్ని 10 రోజులకు పెంచేలా ఆదేశించాలని కోరుతూ ఓ లాయర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారం తెరచి ఉంచాలన్న నిర్ణయంవల్ల ఎక్కువ మంది భక్తులకు అవకాశం దక్కదని, కాబట్టి పది రోజులు తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈనెల 6లోపు నిర్ణయం తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ఆదివారం సాయంత్రం 4గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. కోర్టు ఆదేశాల మేరకు… వైకుంఠద్వార దర్శనంపై పాలక మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. పీఠాధిపతులు, ఆగమ పండితుల సలహాల ఆధారంగా పాలక మండలి సభ్యులు ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఆ తర్వాతే… వైకుంఠ ద్వారాలు ఎన్నిరోజులు తెరవాలనేదానిపై పాలక మండలి తుది నిర్ణయం ప్రకటించనుంది.

మనదేశంలోని ప్రాచీన ఆలయాలన్నింటిలోనూ వైకుంఠ ద్వార దర్శనం 10రోజులపాటు ఉంటుందన్నారు చిన్నజీయర్ స్వామీజీ. ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజుల పాటు స్వామివారు వైకుంఠ ద్వారం నుంచే వెళ్తుంటారని…  అందువల్ల తిరుమలలోనూ 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని సూచించారు. మరి పాలకమండలి భేటీలో వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సాయంత్రం వరకు వేచిచూడాలి.

Read More : బెయిల్ డ్రామా : పోలీసులపై జేసీ ఆగ్రహం