Andhra Pradesh Election : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు, సర్వత్రా ఉత్కంఠ

ఏపీలో మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. ఆదివారం సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు..

Andhra Pradesh Election : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు, సర్వత్రా ఉత్కంఠ

Ap

municipal corporation results : ఏపీలో మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. ఆదివారం సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.. ఈ నెల 10న మొత్తం 71 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరిగింది. అయితే కోర్టు ఉత్తర్వులున్న ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించడం లేదని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది ఎస్‌ఈసీ. పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి దాటే వరకు లెక్కింపు జరగడంతో ఇబ్బందులు వచ్చాయని గుర్తించిన అధికారులు.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సాయంత్రంలోపు లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు వారి తరఫు ఏజెంట్లు రావాల్సి ఉంటుంది. వారి సమక్షంలో ఏడు గంటలకు బ్యాలెట్ బాక్సుల సీల్ ఓపెన్ చేస్తారు. ఫలితాలన్నీ వచ్చాక ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు.

కీలకంగా భావిస్తున్న విశాఖ కార్పొరేషన్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనుంది. విశాఖలో ఎనిమిది జోన్లు ఉండగా ఒక్కో జోన్‌కు ఒక్కో బిల్డింగ్ కేటాయించారు. మొత్తం 98 వార్డులకు 98 గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరోవైపు.. విజయవాడ కార్పొరేషన్‌ ఓట్లను ఉదయం 7 గంటల నుంచే లెక్కించడం మొదలుపెడతారు. లయోల కాలేజీలోని రెండు బ్లాకుల్లో మొత్తం 64 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 23 కౌంటింగ్‌ హాళ్లు, 176 టేబుళ్లతో మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

గుంటూరు కార్పొరేషన్‌లో 57 డివిజన్లకు ఒకటి ఏకగ్రీవం కాగా 56 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. గుంటూరు కార్పొరేషన్‌కు సంబంధించి నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో 34 డివిజన్లు, లయోల పబ్లిక్‌ స్కూల్‌లో 22 డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

తిరుపతిలో 27 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరిగిన 131 పోలింగ్‌ కేంద్రాల్లోని 131 బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించేందుకు 180 మంది సూపర్‌వైజర్లు, 480 మంది సహాయకులను నియమించారు.
మొత్తంగా పుర పోరులో గెలుపెవరిదో ఆదివారం తేలిపోనుంది. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. మేయర్‌ ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్లు ఉంటారు. ఒకే జిల్లాలో రెండు కార్పొరేషన్లుంటే ఒక చోట కలెక్టర్‌, రెండో చోట జాయింట్‌ కలెక్టర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.