ఏపీలో మున్సిపోల్స్ : ప్రచారం సమాప్తం, ఆగిన మైకుల మోత

ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్‌ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాయి...

ఏపీలో మున్సిపోల్స్ : ప్రచారం సమాప్తం, ఆగిన మైకుల మోత

Election

Municipal Elections : ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్‌ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాయి. ఎల్లుండి 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 5 గంటలకు ప్రచార గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. ఇటు ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజనపై 40కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అవకతవకలు సవరించాకే ఎన్నికలు జరపాలని ఆదేశించింది.

మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు పార్టీ సింబల్‌తో జరుగుతుండటంతో… అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించాయి. దీంతో ఈ ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. కూల్‌గా మొదలైన ప్రచారం చివరకు చేరే సరికి సెగలు పుట్టించింది. వైసీపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడగా… బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌లు సైలెంట్‌గా ప్రచారాన్ని సాగించాయి.

మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలకు అప్పగించారు వైఎస్‌ జగన్‌. ఆయన సాధారణ పరిపాలనకే పరిమిమయ్యారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే చిత్తూరు జిల్లాలో మరోసారి పెద్ద మొత్తంలో వార్డులు ఏకగ్రీవం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపు కోసం తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. వలసలను ప్రోత్సహించారు. మిగిలిన మంత్రులు ఆయా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకోగా.. విశాఖటప్నం, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్‌షో నిర్వహించారు. టీడీపీలో అంతర్గత విభేదాలను చక్కబెడుతూనే ప్రచారం చేశారు. ఇక గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేశారు నారా లోకేష్‌. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించగా.. ఓ అభిమానిపై చేయి చేసుకోవడం వివాదస్పదంగా మారింది.

బీజేపీ, జనసేన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కలిసి బరిలో నిలిచాయి. అవగాహనతో సీట్ల పంపకాలు చేసుకున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం బీజేపీ ప్రచారానికి అడుగడుగునా బ్రేకులు వేసినా.. ఆ పార్టీ నేతలు వెనక్కి తగ్గలేదు. జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ విశాఖ కార్పొరేషన్‌తో పాటు ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తారని ప్రకటించినా…. ప్రచారానికి దూరంగా ఉన్నారు పవన్‌.